జోనల్ పద్ధతిలో నిర్వహించడంపై పిటిషన్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు
టిఎస్ పియస్సి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్-2 పరీక్షపై అప్పుడే న్యాయపోరాటాలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 1975 నుంచి వచ్చిన జోనల్ వ్యవస్థ రద్దు అయింది. దీంతో అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలో కూడా రాష్ట్రం మొత్తాన్ని ఒక్క యూనిట్ గా తీసుకొని నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో కూడా జోనల్ వ్యవస్థకు సంబంధించిన అంశాన్ని పేర్కొనలేదు. దీంతో జోనల్ వ్యవస్థ రాష్ట్రంలో అమలులో ఉందా లేదా.. అనే విషయం పై ఎవరికీ స్పష్టత లేదు. దీంతో టిఎస్ పియస్సి కూడా తన నియామకాలన్నీ పాత జోనల్ విధానంలోనే చేపడుతోంది.
గ్రూప్ 2 కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు టిఎస్ పియసి కూడా జోనల్ పద్ధతిలోనే నియాకాలు చేపడుతున్నట్లు స్పష్టంగా పేర్కొంది. అయితే పరీక్ష ముగిసిన వెంటనే జోనల్ వ్యవస్థ కొత్త రాష్ట్రంలో రద్దు అయందని భావించిన కొందరు అభ్యర్థులు ఈ విషయమై కోర్టుకు వెళ్లారు.
జోనల్ పద్ధతిలో నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. 1032 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల చేయగా, అనుబంధంగా ఈ ఏడాది సెప్టెంబర్ 1న మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశారు. దీనినే సవాల్ చేస్తూ కరీంనగర్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులు వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టికల్ 371-డి ప్రకారం జోనల్ విధానం లేదని పిటిషన్‌లో వారు ప్రధానంగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వులు లేకుండా జోనల్ పద్ధతి భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారని తెలిపారు. ఈ పిటిషన్‌పై స్పందించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని టిఎస్ పియస్సిని హైకోర్టు ఆదేశించింది.
