టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసందే. దీంతో పలు పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసందే. దీంతో పలు పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్.. అటు ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తున్నాయి. సిట్ ఇప్పటికే 20 మందికి పైగా అరెస్ట్ చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ నిర్వహించాల్సిన పలు పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. వాయిదా పడిన పరీక్షల రీషెడ్యూల్ చేస్తోంది. తాజాగా మరో రెండు పరీక్షల నిర్వహణ తేదీలను టీఎస్‌పీఎస్సీ రీషెడ్యూల్ చేసింది.
పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లు, సాంకేతిక, ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ రీషెడ్యూల్ చేసింది. పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి మే 13న పరీక్ష నిర్వహించనున్నట్లు ఇటీవల టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే తాజా ప్రకటనలో సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టుగా తెలిపింది. ఇక, మే 17న జరగాల్సిన ఇంటర్, సాంకేతిక విద్యా శాఖల్లో ఫిజికల్ డైరెక్టర్ల నియామక పరీక్షను సెప్టెంబర్ 11వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
ఇక, పాలిటెక్నిక్ కళాశాలలో 247 లెక్చరర్ పోస్టులకు, సాంకేతిక, ఇంటర్ విద్యలో 128 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు తొలుత కమిషన్ తెలిపింది. అయితే పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో ఈ రెండు పరీక్షలను కూడా సీబీఆర్‌టీ మోడ్(కంప్యూటర్ ఆధారిత) విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అందుకు అనుగుణంగా.. పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేసినట్టుగా తెలుస్తోంది.
