హైదరాబాద్: గ్రేటర్ హైద్రాబాద్ లో వరద సహాయం నిలిపివేతపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయమై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయడంతోనే వరద సహాయాన్ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించిందని ఆయన అభిప్రాయపడ్డారు.

నగరంలో వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు రూ. 10 వేల ఆర్ధిక సహాయాన్ని నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి  బుధవారం నాడు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 

మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ అమల్లోకి రావడంతో ఈ వరద సహాయాన్ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. 

also read:జీహెచ్ఎంసీలో వంద సీట్లకు పైగా గెలుస్తాం: టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కేసీఆర్

ఈసీకి ఫిర్యాదు చేసి వేలాది మంది ప్రజలకు బీజేపీ నష్టం చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్నికల పేరుతో సహాయం అందకుండా పోయిందన్నారు. వరద సహాయం అందాల్సిన ప్రజలు ఇంకా వేలాది మంది ఉన్నారని కేసీఆర్ చెప్పారు. వరద బాధితుల ఆర్ధిక సహాయం కోసం రెండు లక్షల ధరఖాస్తులు వచ్చినట్టుగా ఆయన తెలిపారు.

ఇప్పటికే 1.60 లక్షల మంది ధరఖాస్తులను క్లియర్ చేశామన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మిగిలిన వారికి కూడ డబ్బులు అందిస్తామని ఆయన ప్రకటించారు.

ఈ ఏడాది అక్టోబర్ 13, 17 తేదీల్లో నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగానే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు రూ. 10 వేలు పరిహారంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.