హైదరాబాద్: ఆర్టీసీ యూనియన్ల జేఏసి కన్వీనర్, టీఎంయూ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) భారీ షాక్ ఇచ్చింది. ఆయనకు సెలవు ఇచ్చేందుకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిరాకరించింది. అందుకు గల కారణాలను కూడా తెలిపింది.

సంస్థ ప్రస్తుతం ఆర్థి సంక్షోభంలో ఉందని, ప్రతి ఉద్యోగి తప్పకుండా విధులు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. అందువల్ల సెలవు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు మహాత్మాగాంధీ బస్ స్టాండ్ లో నోటీసు బోర్డుపై నిరాకరణ పత్రాన్ని అతికించింది. 

ఆర్టీసీ ఉద్యోగులు అక్టోబర్ 5 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు 55 రోజులు సమ్మె చేయడం, ఆ తర్వాత సీఎం కేసీఆర్ ప్రకటనతో విధుల్లో చేరడం తెలిసిందే. తనకు ఆరు నెలల పాటు సెలవు కావాలని, ఈ నెల 6 నుంచి 20202 మే 5వ తేదీ వరకు సెలవు మంజూరు చేయాలని ఆయన ఈ నెల 5వ తేదీన దరఖాస్తు పెట్టుకున్నారు. 

అయితే సెలవు ఇవ్వలేమని, విధుల్లో చేరాలని తెలియజేస్తూ నోటీసు బోర్డుపై కస్టమర్ రిలేషన్స్ మేనేజర్ పేరిట తిరస్కరణ పత్రాన్ని అతికించారు. అయితే, ఉద్యోగికి సెలవు నిరాకరిస్తే వ్యక్తిగతంగా వివరణ లేఖ ఇవ్వాల్సి ఉంటుందని, తనకు అలాంటి వివరణ లేఖ అందలేదని అశ్వత్థామ రెడ్డి అన్నారు. 

అధికారులు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వంద మంది ఉద్యోగులతో నిర్వహించే వన భోజనాల వల్ల ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు.