యువత అభివృద్ధికారక జాతీయవాదాన్ని తమ అజెండాగా స్వీకరించాలని, తద్వారా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ను నిలపాలని సూచించారు. యువత సంకుచిత ధోరణులను పక్కనపెట్టి, ఉత్తమమైనవాటితో పోటీ పడితేనే ఇది సాధ్యపడుతుందని ఆయన ట్వీట్ చేశారు.
హైదరాబాద్: అభివృద్ధికారక జాతీయవాదమే యువత అజెండాగా ఉండాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన తొలి ప్రపంచ దేశాల్లో భారత్ తన స్థానాన్ని సంపాదించుకోవాలని యువతకు సూచనలు చేశారు. ఇది నిజం కావాలంటే.. భారత యువత ప్రపంచంలో ఉత్తమమైనవాటితో పోటీ పడాలని, సంకుచిత మత, కుల విభజనలను పక్కపెట్టాలని తెలిపారు. అలాగైతేనే.. భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందని వివరించారు. ఇది ఇప్పుడే జరగాల్సిన మార్పు అని పేర్కొన్నారు.
మిగతా దేశాలతో పోలిస్తే భారత్ అభివృద్ధి బాటలో వెనుకంజ పట్టడానికి గల కారణాలను మంత్రి కేటీఆర్ వివరిస్తూ చేసిన ఓ ప్రసంగాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ రీట్వీట్ చేసిన తన ప్రసంగంలోనూ యువత ఎలా ఉండాలో పలు సూచనలు చేశారు. రాజకీయాలు, వాగ్యుద్ధాలు అన్నింటినీ పక్కనపెట్టాలని, ప్రపంచశ్రేణి, ఉత్తమ ఉత్పత్తులను అభివృద్ధి చేసే పనిలో యువత ఉండాలని తెలిపారు.
ఆ వీడియోలో కేటీఆర్ ఇలా మాట్లాడారు.. ప్రపంచ దిగ్గజ సంస్థలకు భారతీయులు సీఈవోలు అవుతున్నారని, వాటికి నాయకత్వం వహిస్తున్నారని, అలాంటి భారతీయులు ప్రపంచశ్రేణి ఉత్పత్తులను తయారు చేయలేరా? అంటూ ప్రశ్నించారు. అంత సత్తా మన దేశ పౌరులకు లేదా? అంటూ అడిగారు. తానే సమాదానం చెబుతూ.. అంతా తెలివి ఉన్నా.. దాన్ని అందుకోసం కాకుండా సంకుచిత విభజనల వైపు తిప్పుతున్నామని పేర్కొన్నారు. కులం, మతం వంటి సంకుచిత వాదాల వైపు, వాట్సాప్ విష ప్రచారాల వైపు బుర్రను తింపి సమయాన్ని, సామర్థ్యాన్ని వృథా చేసుకుంటున్నామని ఆవేదన చెందారు.
‘మనమెందుకు మన కంటే బెస్ట్‌గా ఉన్నవారిని ఎంచుకుని వారితో పోటీ పడొద్దు? ఎన్నాళ్లు ఇంకా పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ వంటి దేశాలతోనే పోల్చుకుంటూ ఉండాలి?’ అని అన్నారు. ఇదే సందర్భంలో ఆయన చైనాతో భారత్‌ను పోలుస్తూ ఓ విశ్లేషణ చేశారు. 1987లో భారత్, చైనాల జీడీపీలు సమానంగా ఉన్నదని, 470 బిలియన్ డాలర్లుగా ఉండేదని వివరించారు. 35 సంవత్సరాల తర్వాత ఈ రెండు దేశాల పురోగతిలో చాలా తేడా ఉన్నదని తెలిపారు. నేడు భారత జీడీపీ 3 ట్రిలియన్ డాలర్లు అని, అదే చైనా జీడీపీ 16 ట్రిలియన్ డాలర్లు అని వివరించారు. ఈ తేడా ఎందుకు? అని ఆరా తీశారు. ‘చైనా వారు మనలాగా మతాలు, కులాల పేరిట వాదులాడుకోలేదు. ఈ సంకుచిత ఆలోచనలతో పంచాయితిలు పెట్టుకోలేదు. వారు వారి పంచాయితి అభివృద్ధి చెందిన అమెరికాతో అనుకున్నాడు. అబివృద్ధి బాటలో సాగాడు. వరుసగా 25 ఏళ్లపాటు చైనా డబుల్ డిజిట్స్ గ్రోత్ సాధించింది. కానీ, మనం సంకుచిత ధోరణులతో పంచాయితీలు పెట్టుకున్నందున వారితో పోల్చితే వెనుకబడ్డాం’ అని వివరించారు.
ఇదే సందర్భంలో ఆయన యువతకు పలు విజ్ఞప్తులు చేశారు. రాజకీయ విన్యాసాలు, వాగ్యుద్ధాలు ఎప్పుడూ ఉండనే ఉంటాయని వివరించారు. కాబట్టి, వాటిని పట్టించుకోకుండా ఒక ప్రపంచానికి ఒక ఉత్తమ ప్రాడక్ట్ అందించాలని, ఒక గూగుల్, ఒక ఫేస్ బుక్ వంటి ప్రాడక్ట్‌ను అందిస్తే తప్పకుండా లక్షల మందికి ఉపాధి లభించే అవకాశాలు ఉంటాయని తెలిపారు.
