Asianet News TeluguAsianet News Telugu

మీకు చేయాల్సినవి ఇంకెన్నో... దయచేసి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి: నేతన్నలతో మంత్రి హరీష్

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణం జరిగిన చేనేత కార్మికులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత రంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో వివరించారు. 

TS Finance Minister Harish Rao Distributes Cheques to Handloom Workers in Jammikunta
Author
Huzurabad, First Published Sep 14, 2021, 3:51 PM IST

కరీంనగర్: మిమ్మల్ని కాపాడుకున్నోళ్లు ఎవరు... ముంచింది ఎవరు గుర్తు పెట్టుకోవాలని చేనేత కార్మికులకు ఆర్థిక మంత్రి హరీష్ రావు సూచించారు. న్యాయం, ధర్మం వైపు నిలబడాలని... వ్యక్తి ప్రయోజనం ముఖ్యమో.. నేతన్నల ప్రయోజనం ముఖ్యమో ఆలోచించుకోవాలన్నారు. ఇంకా నేతన్నలకు చేయాల్సినవి చాలా ఉన్నాయని... చేనేత కార్మికుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాబట్టి పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని హుజురాబాద్ లోని చేనేత కుటుంబాలను మంత్రి హరీష్ కోరారు. 

జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ లో చేనేత కార్మికులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎల్ రమణ, పెద్దిరెడ్డి, కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... తెలంగాణ రాకముందు రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండేవన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు భరోసా దొరికిందని మంత్రి పేర్కొన్నారు. 

''చేనేత కార్మికులకు రూ.100 కోట్లతో రుణ విముక్తులను చేశాం. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తున్నాం. ముడి సరుకుకు సబ్సిడీ అందజెస్తున్నాం. త్రిఫ్ట్ ఫండ్ కూడా ఇస్తున్నాం. త్రిఫ్ట్ పథకానికి మంత్రి కేటీఆర్ రూ.30 కోట్లు ఇచ్చారు. చేనేత కార్మికులు రూ.800, రూ.1200 కట్టినా రెండింతలు ప్రభుత్వం జమ చేస్తది. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చేనేత కార్మికుల కోసమే ప్రత్యేకంగా 8 పథకాలు వచ్చాయి'' అని మంత్రి వివరించారు. 

read more  Huzurabad Bypoll: నా భరతం పడితే నీకేం వస్తుంది ఈటల...: మంత్రి హరీష్ కౌంటర్

'ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు ఏం ఇచ్చింది. ఇవ్వడం అటుంచి చేనేత కార్మికుల పథకాలను ఊడగొట్టి నోటి కాడి బుక్క ఎత్తగొట్టారు. ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డును కేంద్రం రద్దు చేసింది. బోర్డును బలోపేతం చేయాల్సిన కేంద్రం చేనేత కార్మికుల ఉసురు పోసుకుంది. బీజేపీ 4 శాతం త్రిఫ్ట్ ను రద్దు చేస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం 16 శాతం త్రిఫ్ట్ ఫండ్ ఇస్తోంది. చేనేత కార్మికుల్లో ఆదరణ పొందిన ఆరోగ్య భీమా పథకాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేతన్నలకు అన్యాయం చేసింది'' అని మంత్రి ఆరోపించారు.

''హుజురాబాద్ కు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ 4వేల ఇండ్లు మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదు. మీరు ఆశీర్వాదం ఇస్తే మీ సొంత జాగాల్లోనే ఇల్లు ఇస్తాం. స్థలం లేకుంటే ఇల్లు కూడ కట్టి ఇస్తాం'' అని మంత్రి హామీ ఇచ్చారు. 

''హుజురాబాద్ లో పద్మశాలి భవన్ కోసం ఎకరా స్థలం, కోటి రూపాయలు ఇచ్చాం. రాబోయే కొద్దిరోజుల్లో జమ్మికుంటలో కూడా ఎకరా స్థలం కేటాయిస్తాం. మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. బిజెపి వాళ్లవి రద్దులు... మేము చేసేది మంజూరు. రద్దులు చేసే వాళ్లను మనము కూడా రద్దు చేయాలి'' అని హరీష్ సూచించారు.

 
 

Follow Us:
Download App:
  • android
  • ios