హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆమెను హాస్పిటల్ కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అయితే ఆమెకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని... ఆమెకు చేసిన వైద్య పరీక్షలన్నీ నార్మల్ గానే తేలినట్లు డాక్టర్లు తెలిపారు. 

అయితే మంత్రి ఆరోగ్య పరిస్థితిపై బయట వివిధ రకాలుగా ప్రచారం జరుగుతోంది. వీటిని నిజమని నమ్మి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మంత్రి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. దీంతో సబితా ఇంద్రారెడ్డి ఆరోగ్యానికి సంబంధించి విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

విద్యాశాఖ ప్రకటన: 

మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభిమానులకు ,పార్టీ కార్యకర్తల కు,మీడియా మిత్రులకు మనవి.....

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. స్వల్ప అస్వస్థతతో మాత్రమే ఆస్పత్రికి వెళ్లారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించగా రిపోర్ట్ లు అన్నీ నార్మల్ గా వచ్చాయి. మరి కొద్ది సేపట్లో ఇంటికి చేరుకోనున్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు...అందరి ఆధరాభిమానాలతో, దేవుని కృప తో మంత్రి గారు సంపూర్ణ ఆరోగ్యం తో ఉన్నారు.

ఇట్లు
విద్యా శాఖ మంత్రి కార్యాలయం.