మహాత్మా గాంధీ మళ్లీ పుట్టి ఇలాంటి ర్యాలీకి అనుమతి కోరితే మన తెలంగాణ పోలీసులు బ్రిటీష్ వాళ్లు ఆయన మీద పెట్టిన కేసులన్నీ తిరగదోడుతారేమో... ఆయన ర్యాలీకి కూడా అనుమతివ్వకుండా అడ్డుపడుతారేమో... నిజంగా మీరు సూపర్ కాప్ లే.. 

లక్ష ఉద్యోగాలపై ప్రభుత్వంలో కదలిక తెచ్చేందుకు తెలంగాణ రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ రేపు నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

దీని కోసం 31 జిల్లాల్లో జేఏసీ చైర్మన్ కోదండరాం పర్యటించి ర్యాలీకి విద్యార్థుల నుంచి మద్దతు కూడా కూడగట్టారు. నెల రోజుల ముందే ర్యాలీ నిర్వహణకు పోలీసుల అనుమతి కూడా కోరారు.

నిన్నటి వరకు కూడా దీనిపై ఎటూ తేల్చని పోలీసులు హైకోర్టు జోక్యం చేసుకోవడంతో కాస్త స్పందించింది. అయితే టీజేఏసీ ర్యాలీకి అనుమతివ్వకపోవడానికి తెలంగాణ పోలీసులు చెబుతున్న కారణం వింటుంటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన టీ జేఏసీ మీద 31 కేసులు ఉన్నాయట. రేపు నిర్వహించే ర్యాలీలో సంఘ విద్రోహ శక్తులు చొరబడే అవకాశముందని ఇంటలిజెన్స్ రిపోర్ట్లో తేలిందట. జల్లికట్టు తరహాలో ఉద్యమం చేయాలని టీ జేఏసీ నిర్ణయించిందట. అందుకే దీనికి అనుమతి ఇవ్వం అని వివరణ ఇచ్చారు.

అసలు టీ జేఏసీ ని స్థాపించిందే సీఎం కేసీఆర్ అని గులాబీ నేతలు ఊదరగొడుతుంటారు. జేఏసీ చైర్మన్ కోదండరాం కేవలం డమ్మీ అని కేసీఆర్ ఆధ్వర్యంలోనే టీ జేఏసీ నడిచిందని గొప్పగా చెబుతుంటారు. మిలియన్ మార్చ్ , రైల్ రోకో, సకల జనుల సమ్మె తదితర ఉద్యమాలన్నీ కేసీఆర్ ఆధ్వర్యంలోనే జరిగాయని వాదిస్తుంటారు. అదే నిజమైతే జేఏసీ కి సర్వంగా ఉన్న కేసీఆర్ కు ఈ కేసులు వర్తించాలి కదా.. మరి కేసీఆర్ ర్యాలీలు, సభలకు ఎందుకు అనుమతిస్తున్నారు అనేది పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఉద్యమ సమయంలో కేసీఆర్ పై రాజద్రోహం కేసు కూడా నమోదైంది. అంతేకాదు రైల్ రోకో సందర్భంగా ఉన్న కేసుకు సీఎం హోదాలో ఆయన కోర్టుకు హాజరవ్వాల్సి వచ్చింది. 

ఉద్యమ సమయంలో 100 కేసులున్న వారు ఎన్నికల్లో గెలిచి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెడితే శాంతిభద్రతలకు సమస్య రాదా.. క్రిమినల్ కేసుల్లో బుక్ అయి బెయిల్ మీద బయటకొచ్చిన నేతలు రోడ్డు షో లు చేసినప్పుడు సామాన్యులకు భద్రత కరవవదా..

మహాత్మా గాంధీ మళ్లీ పుట్టి ఇలాంటి ర్యాలీకి అనుమతి కోరితే మన తెలంగాణ పోలీసులు బ్రిటీష్ వాళ్లు ఆయన మీద పెట్టిన కేసులన్నీ తిరగదోడుతారేమో... ఆయన ర్యాలీకి కూడా అనుమతివ్వకుండా అడ్డుపడుతారేమో... నిజంగా మీరు సూపర్ కాప్ లే..

అధికారంలో ఉన్న వాళ్లకు ఒక రూలు, అధికార పక్షాన్ని ప్రశ్నించేవారికి ఒక రూలా పోలీసులూ...? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.