భూసేకరణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ రాకెట్ స్పీడ్ తో ఈ రోజు భూసేకరణ చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేసినా కనీస చర్చ కూడా లేకుండానే బిల్లును పాస్ చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ చట్టంలో లోపాలున్నాయని దానికి సవరణలు చేసి పంపాలని ఇటీవల కేంద్రం బిల్లును తిప్పి పంపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సవరణలతో కూడిన బిల్లును మళ్లీ ఆమోదించేందుకు ఆదివారం ఉదయం ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచారు.
శాసనసభలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ భూసేకరణ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అదే సమయంలో రాష్ట్రంలో రైతు సమస్యలపై చర్చకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో బిల్లుపై చర్చ లేకుండానే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అనంతరం స్పీకర్ శాసన సభను నిరవధికంగా వాయిదా వేశారు.
