ట్రంప్ పొమ్మన్నాడు... వీసా బాలాజీ రమ్మన్నాడు

Trump prospective victims flock to Chilukuru Visa god for help
Highlights

ట్రంప్ తాత్కాలికం, బాలాజీ శాశ్వతం అని అక్కడికి వచ్చిన భక్తులకు భరోసా ఇస్తున్నారు ఆలయ ప్రధాన అర్చకులు.

 

భారతీయుల డాలర్ డ్రీమ్స్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్క కలంపోటుతో కల్లలు చేశాడు.

 

హెచ్ 1 బీ వీసా లపై కఠిన నిబంధనలు విధించడంతో ఇక మన వాళ్లు అమెరికా వెళ్లే దారులు మరింత క్లిష్టమయ్యాయి.

 

మరోవైపు అక్కడున్న మనవాళ్లను జాతి విద్వేశంతో కాల్చిచంపుతున్నారు. కూచిబొట్ల శ్రీనివాస్ మరణాంతరం విద్వేశపు దాడుల వార్తలు రోజూ వినిపిస్తూనే ఉన్నాయి.

 

మరిప్పుడు మనవాళ్ల పరిస్థితి ఏంటీ ... ఎన్నో ఆశలతో కలల దేశంలో కాలుపెట్టాలనుకుంటున్న మన వాళ్లకు ట్రంప్ ఫియర్ ను వదిలించేవాళ్లే లేరా... ఉన్నాడనే అంటున్నారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్.

 

హైదరాబాద్ నగర శివార్ల లో ఉండే చిలుకూరు బాలాజీ గురించి ప్రత్యేకంగా పరిచయమే అక్కర్లేదు.

 

వీసాలిచ్చే బాలాజీగా ఈ వేంకటేశ్వరస్వామికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. మన వాళ్లు వీసా రిజెక్టు అయిన ప్రతీసారి ఈ బాలాజీని మొక్కుకోవడం వెంటనే వీసా కు అనుమతి లభించడం పరిపాటి.

 

అందుకే చిలుకూరు బాలాజీని అందరూ వీసా బాలాజీగానే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు.

 

మన రాష్ట్రం నుంచే కాదు దేశంలోని చాలా ప్రాంతాల నుంచి కేవలం వీసా అనుమతి కోసమే ఇక్కడికి వచ్చేవారు చాలా మంది కనిపిస్తుంటారు.

 

ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ నేపథ్యంలో చిలుకూరుకు క్యూ కడుతున్నవారి సంఖ్య బాగా పెరుగుతోంది. ఈ సందర్భంగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ వీసాల కఠిన నిబంధనలపై స్పందించారు.

 

చిలుకూరు బాలాజీ గుడి చుట్టూ  108 సార్లు ప్రదక్షణ చేయండి ట్రంప్ నిబంధనలను ఆ దేవుడే చూసుకుంటాడని భరోసా ఇస్తున్నారు.

 

ట్రంప్ తాత్కాలికం, బాలాజీ శాశ్వతం అని అక్కడికి వచ్చినవారికి ధైర్యం చెబుతున్నారు.

loader