రిపబ్లికన్ డాటా ఎనలిస్ట్ గా పనిచేసిన అవినాశ్ గతంలో వైఎస్సార్ సిపి ప్రచార బృందంలో సభ్యుడు
అమెరికాకు 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ విజయం వెనుక ఒక తెలుగువాడి కృషి ఉంది. ట్రంప్ ఎన్నికల ప్రచార బృందంలో ఒకడైన ఆ తెలుగు కుర్రాడి పేరు అవినాష్ ఇరగవరపు.ఏడాది పాటు సాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో ఎంతో మంది వ్యూహకర్తలు అధ్యక్ష అభ్యర్థుల గెలుపునకు నిరంతరం కృషి చేస్తారు. అందులో మన తెలుగువాడు అవినాశ్ ఒకరు.
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు గ్రామానికి చెందిన ఇరగవరపు పాపారావుకు ఇద్దరు కుమారులు. వారిలో అవినాష్ ఒకరు. లక్నో ఐఐఎంలో ఎంబీఏ పూర్తి చేసిన అవినాశ్ తర్వాత ఇన్‌టెల్‌లో ఉద్యోగం చేస్తూనే భారత్లోని రాజకీయ పార్టీలపై ప్రజలకున్న అభిప్రాయాలు గురించి డాటా ఎనాలసిస్ చేస్తుండేవారు. ఈనేపథ్యంలో 2014లో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించారు.
తదనంతరం అమెరికాలోనే ఆరిజోనా రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న తన భార్య రంజనను కలుసుకునేందుకు వెళ్లిన సమయంలో ఆరిజోనా గవర్నర్ పదవి కోసం జరుగుతున్న ఎన్నికలను నిశితంగా పరిశీలించారు. డేటా ఎనాలసిస్ట్ కావడంతో గవర్నర్ పదవికి పోటీపడుతున్న జూసీకి గెలుపు వ్యూహాల గురించి ఈ-మెయిల్స్ పంపుతుండేవారు. ఆ ఎన్నికల అనంతరం అవినాష్ మేధాశక్తిని గుర్తించిన రిపబ్లికన్ పార్టీ ట్రంప్ ప్రచార వ్యూహబృందంలో ఆయనకు చోటు కల్పించింది. మొదట్లో రిపబ్లికన్ పార్టీకి డేటా ఎనాలసి్‌స్టగా, తదనంతరం రాజకీయ పరిశీలకుడిగా విధులు నిర్వహించేవారు.
అవినాష్ పదునైన వ్యూహాలను గుర్తించడంతో ఆరిజోనా రాష్ట్రం రిపబ్లికన్ పార్టీకి ఈడీగా నియమించారు. ఒక రాష్ట్రానికి పార్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులు కావడంతో అమెరికాలో ఇపుడు తెలుగు వారి నోట అవినాష్ పేరు మార్మోగిపోతుంది. అభ్యర్థుల మధ్య జరిగే డిబేట్‌లోను, సభలు, సమావేశాల్లోను అవినాష్ రాసిచ్చిన ఉపన్యాసాలకు ట్రంప్ అధిక ప్రాధాన్యమివ్వడం గమనార్హం.ఇప్పుడు అవినాశ్ అనుకున్నట్టే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. మరి ట్రంప్ ఈ కోనసీమ కుర్రాడికి ఏ పదవి కట్టబెడుతారో చూడాలి.
