హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు తమ తమ రాష్ట్రాల  ప్రయోజనాల కోసం పార్లమెంట్ వేదికగా పోరాటం చేయనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఇటీవల కాలంలో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. కానీ, పార్లమెంట్ వేదికగా మాత్రం రెండు రాష్ట్రాలు ఒకరికిపై మరోకరు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అఫిడవిట్ దాఖలు చేసింది.

ఈ నెల 18వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తమ తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ వేదికగా తమ వాణిని విన్పించనున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల సమస్యలపై రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల ఎంపీలు ఉమ్మడిగా పోరాటం చేయడం లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎంపీలు చాలా సమస్యలపై పరస్పరం వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి.ప్రధానంగా నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలు ఇదే రకమైన వైఖరితో ఉన్నాయి.

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం  రెండు రోజుల క్రితం హైద్రాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. పార్టీ ఎంపీలకు దిశా నిర్ధేశం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్ టీఆర్ఎస్ ఎంపీలను కోరారు. 

Also read:కేసీఆర్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వం షాక్: సుప్రీంలో అఫిడవిట్

వైసీపీ ఎంపీలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై వైసీపీ ఎంపీలకు జగన్ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

కాళేశ్వరం సహా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నీటి పారుదదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఏపీకి చెందిన వైసీపీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించవద్దని కోరుతూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

పోలవరం ప్రాజెక్టును టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ వేదికగా వ్యతిరేకిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేసిన సమయంలో వైసీపీ ఎంపీలు మాత్రం ఈ ప్రాజెక్టును వ్యతిరేకించే అవకాశం లేకపోలేదు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ప్రాంతంలో  కొన్ని గ్రామాలు ముంపుకు గురౌతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపుకు గురయ్యే గ్రామాలను ఏపీకి బదిలీ చేసినట్టుగా ఆ రాష్ట్రం గుర్తు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపు సమస్య తలెత్తే అవకాశం ఉందని చెప్పే అర్హత తెలంగాణ రాష్ట్రానికి లేదని ఏపీ వాదిస్తోంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అని టీఆర్ఎస్ గుర్తు చేస్తోంది.కాళేశ్వరం ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదని టీఆర్ఎస్ వాదిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిన విషయాన్ని టీఆర్ఎస్ గుర్తు చేస్తోంది.

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ లు మూడు దఫాలు సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టును రెండు రాష్ట్రాలు కలిసిన నిర్వహించాలని ప్రతిపాదించారు.