అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అమలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతోందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టం హామీల విషంయలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెసు నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వేసిన పిటిషన్ విచారణలో ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ కౌంటర్ దాకలు చేసింది. 

రాష్ట్ర విబజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచిన నియమ నిబంధనలను, ప్రవర్తనా నియమావళిని తెలంగాణ ప్రభుత్వం పాటించడం లేదని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్ లో ఆరోపించింది. 9,10 షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపకానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల కోసం విడుదల చేసిన నిధుల్లోనూ వాటాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసింది. 

విభజన చట్టం అమలు కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు, సంబంధిత శాఖలు, కార్పోరేషన్ల అధికారులు కలిసి మాట్లాడుకుందామని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని కోరుతున్నా తెలంగాణ ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదని, సమావేశం తేదీకి సంబంధించిన సమాచారం ఇవ్వడం లేదని చెప్పింది. 

విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకు విరుద్ధంగా తెలంగాణ కొత్త ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోందని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. కృష్ణా నిదపై పాలమూరు - రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు వంటి ప్రాజెక్టులను నిర్మిస్తోందని వివరించింది. సీతారామ ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే నిర్మిస్తోందని, ఈ ప్రాజెక్టు ద్వారా 450 టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణ వినియోగించుకుంటుందని, ఈ ప్రాజెక్టు వల్ల దిగువన ఉన్న రైతులు నష్టపోతారని వాదించింది. 

తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై 2016 సెప్టెంబర్ 21వ తేదీన కేంద్రం అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించినా ఏ విధమైన ప్రయోజనం లేకుండా పోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్న కేంద్ర జల మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహా మండలి క్లియరెన్స్ ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం అంటోంది.

వివిధ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న వైఖరిని తప్పు పడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.