హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్‌ గుర్తును పోలిన ట్రక్కుకు వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి రాలేదని కేటీఆర్ గుర్తుచేశారు. 3,148 వార్డులకు గాను 600 చోట్ల బీజేపీకి అభ్యర్థులు దొరకడం లేదని, బీఫారంలు ఇస్తామన్నా వద్దంటున్నారని ఆయన సెటైర్లు వేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవాలన్నరు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సోమవారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌కు పెయిడ్ వర్కర్స్ ఎవ్వరూ లేరని కేవలం కేసీఆర్‌పైనా, పార్టీపైనా అభిమానంతోనే ఇంతమంది పనిచేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాలకు అందుతున్నాయన్నారు. సీఎం ప్రతిరోజూ కనీసం ఒక గంటైనా సోషల్ మీడియాను చూస్తారని కేటీఆర్ తెలిపారు.

Also Read:జగన్‌కు హిమాన్ష్ కరచాలనం, కేసీఆర్ కాళ్లుమొక్కిన విజయసాయి

సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత నేరుగా ప్రజలతో తమ అభిప్రాయాలను నేరుగా పంచుకోవచ్చునన్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు.. వారి నాడి ఏంటో తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఉపకరిస్తుందని మంత్రి అన్నారు.

తిమ్మినిబొమ్మిని చేయడంలో ప్రత్యర్థి పార్టీలు సిద్ధహస్తులని.. టీఆర్ఎస్ ఇస్తున్న రూ.2000 పెన్షన్‌లో రూ1,800 ఢిల్లీ నుంచే వస్తున్నాయని ఒక పార్టీ నేతలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రత్యర్ధులు, ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిందిగా ఆయన టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగాన్ని ఆదేశించారు. 

టీఆర్ఎస్ పార్టీకి బాసులు ఢిల్లీలో లేరని.. తెలంగాణ గల్లీ గల్లీకి మన బాసులు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగానికి ఈ సందర్భంగా ఆయన నలుగురు కో ఆర్డినేటర్లను నియమించారు. మకర సంక్రాంతితో ప్రతిపక్షాల బ్రాంతి కూడా తొలగాలని కేటీఆర్ అన్నారు.

కేసీఆర్ ముగ్గులు, కేసీఆర్ పతంగులు, కారు గుర్తు పెట్టి ప్రచారం నిర్వహించాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్రంల ఏర్పడిన తర్వాత 3.70 లక్షల ఎల్‌ఈడీ బల్బులను అమర్చడం వల్ల మున్సిపాలిటీల్లో 30 శాతం ఎలక్ట్రిసిటి బిల్లులను తగ్గించగలిగామని మంత్రి గుర్తుచేశారు.

Also Read:హరీష్, కవితలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇవీ

ఖైరతాబాద్ జలమండలి ముందు గతంలో ఖాళీ బిందెలతో ధర్నాలు జరిగేవని, కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి ఘటనలేవి నమోదు కాలేదని కేటీఆర్ గుర్తుచేశారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మున్సిపాలిటీలకు ఇచ్చిన నిధుల కంటే టీఆర్ఎస్ ఐదేళ్లలో ఇచ్చినవే ఎక్కువని కేటీఆర్ సవాల్ విసిరారు.

కొత్త మున్సిపల్ చట్టాన్ని అమలు చేయడం తన ముందున్న కర్తవ్యమన్నారు. ఈ చట్టం అమలులో పర, తమ, భేదాలు ఉండవని.. అవినీతి చీడను రూపుమాపుతామని మంత్రి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణ కొనసీమగా మారడం ఖాయమని ఆయన ఆకాంక్షించారు.