2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుంచి నేటి వరకు టీఆర్ఎస్.. ఏ ఎన్నిక వచ్చినా అప్రహతింగా, అనితర సాధ్యమైన విజయాలను నమోదు చేసిందన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించిన అనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సరిగ్గా ఏడాది క్రితం హుజూర్‌నగర్ ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు.

తాము ఏ ఎన్నికలో గెలిచినా.. విజయాలకు పొంగిపోము, గర్వపడమని.. అపజయాలకు, ఎదురుదెబ్బలకు కృంగిపోమని ఆయన స్పష్టం చేశారు. 

Also Read:దుబ్బాక: కేసీఆర్ కు విజయశాంతి హెచ్చరిక, అదే నిజమైంది

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన 62 పైచీలుకు ప్రజలకు కేటీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా ఉప ఎన్నికలో పార్టీ గెలుపుకోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలు, నేతలకు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

దుబ్బాక ఫలితం తాము ఆశించిన విధంగా రాలేదన్న ఆయన.. సహజంగా ఎన్నికల్లో గెలుపుకోసమే పనిచేస్తామని చెప్పారు. ఆరున్నరేళ్ల కాలంలో ఎన్నో విజయాలు, గెలుపులు కైవసం చేసుకున్నామన్నారు.

అయితే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఒకరకంగా తమకు అప్రమత్తయ్యేందుకు దోహదం చేస్తుందని కేటీఆర్ తెలిపారు. తాము ఆశించిన విధంగా ఎందుకు ఫలితం రాలేదనే దానిపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామన్నారు.