హైదరాబాద్‌ : ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం చిత్రం ఎంతో హృద్యంగా ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. సినిమా ఆద్యంతం మానవీయ కోణంలో తెరకెక్కించారని అభిప్రాయపడ్డారు. 

మల్లేశం చిత్రంలో మల్లేశం పాత్రలో ప్రియదర్శి చాలా చక్కగా నటించారని కొనియాడారు. మల్లేశం సినిమాకు తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒక సామాన్యుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం బాగుందన్నారు. 


అంతరించిపోతున్న చేనేత కళకు మల్లేశం చిత్రం జీవం పోసిందన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడి మల్లేశం సినిమాకు వినోదపు పన్ను రాయితీ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. నవీన ఆవిష్కరణల రూపకల్పనలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని మల్లేశం వాటిని అధిగమించి ఆసుయంత్రం తయారుచేసి ఎంతో మంది తల్లులకు ఉపశమనం కల్పించారని కేటీఆర్‌ కొనియాడారు. 

చిత్రం మాటల రచయిత పెద్దింటి అశోక్‌ కుమార్‌ అజ్ఞాతసూర్యుడు అంటూ ప్రశంసించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుందన్నారు. ఇక ఈ సినిమా తర్వాత చేనేత వస్త్రాలు ధరించడం మరింత పెరుగుతుందని కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.