జహీరాబాద్‌లో తెలుగు, ఉర్దూతో పాటు కన్నడ, మరాఠీ మాట్లాడేవారున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సన్నాహకాల్లో భాగంగా కేటీఆర్ బుధవారం జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.

ముందుగా ప్రజలకు కన్నడ, మరాఠీలలో ఆయనకు నమస్కారం తెలియజేశారు. ముథోల్ నియోజకర్గానికి పక్కనే ఉన్న మహారాష్ట్ర నియోజకవర్గంలోని 40 గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో చేర్చుకోవాల్సిందిగా ఏకగ్రీవ తీర్మానం చేశాయని కేటీఆర్ గుర్తు చేశారు.

కేసీఆర్ నాయకత్వం, ఆశయాలు దేశానికే దిక్సూచిగా మారాయని కేటీఆర్ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు గడుస్తున్నా దేశంలో కరెంట్, మంచినీరు, రోడ్లు లేని గ్రామాలున్నాయన్నారు.

రీజనల్ ఫీలింగ్స్‌తో కాంగ్రెస్, కమ్యూనల్ ఫీలింగ్స్ తో బీజేపీ రాజకీయాలను నడుపుతున్నాయని కేటీఆర్ తెలిపారు. దోమకొండ మండలంలోని పోచాన్‌పల్లి గ్రామం తమ పూర్వీకుల గ్రామమని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

అప్పర్ మానేరు ప్రాజెక్ట్ వల్ల పోచాన్‌పల్లి గ్రామం మునిగిపోయిందని అందువల్ల కేసీఆర్ పూర్వీకులు చింతమడక గ్రామానికి వలస వెళ్లారని తెలిపారు. లేకపోతే ముఖ్యమంత్రి కామారెడ్డి శాసనసభ్యుడిగానో, జహీరాబాద్ ఎంపీగానో అయ్యుండేవారని కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు.

మా అమ్మగారి వూరు కూడా అప్పర్ మానేరులో మునిగిపోయిందన్నారు. తెలంగాణ కోటి రతనాల వీణే కాదు.. కోటి ఎకరాల మాగాణం కావాలని కేసీఆర్ ఎంతో శ్రమిస్తున్నారని కేటీఆర్ తెలియజేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని రైతులు కాలర్ ఎగరేసుకుని చెబుతున్నారన్నారు.

రైతు బంధు కింద రూ.8 వేలు ఇవ్వడంలో ముఖ్యమంత్రికి సంతోషం లేదని అందుకే దానిని రూ.10 వేలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. పెన్షన్‌ను రూ.1000ని ఏప్రిల్ నుంచి రూ.2,016కు పెంచామన్నారు.

బీడీ కార్మికుల గురించి ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదని వారికి సైతం రూ.1000 భృతిని ప్రవేశపెట్టారన్నారు. గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు, 75 శాతం సీట్లు కట్టబెట్టారని కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు తోడ కొట్టిన కాంగ్రెస్ నాయకులు మళ్లీ సవాళ్లు విసురుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వమని కేసీఆర్ అడిగితే ఇంతవరకు మోడీ స్పందించలేదని కేటీఆర్ గుర్తుచేశారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు రూ.24,000 కోట్లు కేటాయించాల్సిందిగా నీతిఅయోగ్ సిఫారసు చేస్తే... 24 పైసలు కూడా కేటాయించలేదని కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాని మోడీ గ్రాఫ్ పడిపోయిందని సర్వేలు చెబుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సైతం అంతంత మాత్రంగానే ఉందన్నారు.

అందువల్ల ప్రాంతీయ పార్టీలు రాబోయే కేంద్రప్రభుత్వంలో కీలకపాత్ర పోషించబోతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు అఖండ మెజారిటీ సాధించిపెట్టాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.