వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఆ పార్టీ తరపున పోటీలో నిలిచేందుకు అధికసంఖ్యలో అభ్యర్థులు ఆసక్తి చూపిస్తుండటంతో భీఫామ్ ఎవరికి ఇవ్వాలన్న దానిపై అదిష్టానం తేల్చుకోకలేకపోతోంది. ఈ సమయంలోనే బీఫామ్ అమ్మకాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు కూడా వస్తున్నాయి.

58వ డివిజన్‌ నుండి పోటీ చేయాలని భావించిన టీఆర్ఎస్ నాయకురాలు శోభారాణి నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే తననే అధికారిక అభ్యర్థిగా ప్రకటించాలంటూ ఆమె ఆందోళనకు దిగారు. తనకే టీఆర్ఎస్ బీఫామ్ ఇవ్వాలంటూ పెట్రోల్ సీసాతో హన్మకొండలోని ఓ బహుళ అంతస్తుల భవనంపైకి ఎక్కి నిరసన తెలిపారు శోభారాణి. బీఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ శోభారాణి హెచ్చరించారు.  

గ్రేటర్‌ వరంగల్ ఎన్నికల్లో తనకు అన్యాయం జరిగిందని శోభారాణి ఆరోపించారు. తాను 58వ డివిజన్‌లో నామినేషన్‌ దాఖలు చేశానని.. అయితే బీఫామ్‌ కోసం కొందరు నాయకులు రూ.50లక్షలు డిమాండ్ చేశారని ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది. 

వరంగల్ కార్పోరేషన్ల పాలకవర్గం కాలపరిమితి ముగియడంతో ఎన్నికలను నిర్వహించి నూతన పాలకవర్గాన్ని ఏర్పాటుచేసేందుకు ఈసీ చర్యలు ప్రారంభించింది.  ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. ఈ నెల 22న అంటే ఇవాళ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో పార్టీల భీ పామ్ లో కోసం అభ్యర్థుల్లో ఆందోళనకు గురయ్యారు. 

ఇక అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట నకిరేకల్ మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీగా ఉన్న ఒక్క వార్డుకు ఎన్నికలు నిర్వహించనున్నారు.  ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. మే 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. వరంగల్ లో 66, ఖమ్మం 60 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి.