నల్గొండ: నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ  తన సీటును కోల్పోయింది. గత ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓటమి పాలైన టీఆర్ఎస్ అభ్యర్ధి తేర చిన్నపరెడ్డి ఈ దఫా విజయం సాధించారు.

2015లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయాన్ని సాధించింది. ఈ జిల్లాలో టీఆర్ఎస్‌కు భారీ మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు.  

2015 ఎన్నికల సమయంలో 1110 ఓట్లు పోలయ్యాయి.  పోలైన ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 642 ఓట్ల వచ్చాయి.టీఆర్ఎస్ అభ్యర్ధి తేర చిన్నపరెడ్డికి 449 ఓట్లు మాత్రమే దక్కాయి. ఇండిపెండెంట్ అభ్యర్ధి మిట్ట పురుషోత్తం రెడ్డికి 2 ఓట్లు దక్కాయి.  మెజారిటీ ప్రజా ప్రతినిధులు ఉన్నప్పటికీ టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైంది.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. తన  ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.  దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి ఎన్నికలు నిర్వహించారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  భార్య కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేసింది. మరోసారి టీఆర్ఎస్ అభ్యర్ధిగా తేర చిన్నపరెడ్డి  పోటీ చేశారు. తేర చిన్నపరెడ్డికి 640 ఓట్లు దక్కితే,  కాంగ్రెస్ అభ్యర్ధి  కోమటిరెడ్డి లక్ష్మికి 414 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కోమటిరెడ్డి సోదరులు చేసిన వ్యూహ రచన విజయం సాధించలేదు. ఈ ఎన్నికల్లో లక్ష్మి టీఆర్ఎస్ అభ్యర్ధి చిన్నపరెడ్డి చేతిలో ఓడిపోయింది.