హైదరాబాద్: నేరేడ్‌మెట్ డివిజన్‌లో టీఆర్ఎస్ విజయం సాధించింది. హైకోర్టు తీర్పుతో బుధవారం నాడు కౌంటింగ్ నిర్వహించారు. ఎన్నికల అధికారులపై బీజేపీ అభ్యర్ధి ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్నికల తీరుతో మనోవేదనకు గురైన బీజేపీ అభ్యర్ధి ప్రసన్న కంటతడి పెట్టారు. 

ఈ నెల 4వ తేదీన నేరేడ్‌మెట్ ఫలితాన్ని  ప్రకటించలేదు. మెజారిటీ కంటే ఇతర గుర్తులు ఉన్న బ్యాలెట్ పేపర్లు ఎక్కువగా ఉన్నాయి.దీంతో ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.ఇతర ముద్రలు ఉన్న 544 బ్యాలెట్ పేపర్లను కూడ లెక్కించాలని హైకోర్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది.ఈ ఆదేశం మేరకు బుధవారం నాడు ఉదయం ఓట్లను లెక్కించారు.

ఈ నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు కొనసాగే సమయానికి బీజేపీ అభ్యర్ధి ప్రసన్న కంటే టీఆర్ఎస్ అభ్యర్ధి మీనా ఉపేందర్ రెడ్డి 504 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.ఇవాళ ఉదయం నేరేడ్ మెట్ (136 డివిజన్) ఓట్లను లెక్కించారు. ఇతర ముద్రలు ఉన్న 544 ఓట్లను మాత్రమే ఇవాళ లెక్కించారు. 782 ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్ధి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించినట్టుగా అధికారులు ప్రకటించారు.

also read:నేరేడ్‌మెట్ డివిజన్ ఫలితం వెల్లడికి గ్రీన్ సిగ్నల్: హైకోర్టు కీలక ఆదేశం

1300 ఓట్లను లెక్కించాలని బీజేపీ అభ్యర్ధి ప్రసన్న డిమాండ్ చేశారు. కానీ ఎన్నికల అధికారులు కేవలం 544 ఓట్లను మాత్రమే లెక్కించారని  ఆమె ఆరోపించారు.అధికారుల తీరుతో మనోవేదనకు గురైన బీజేపీ అభ్యర్ధి ప్రసన్న కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొన్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు.

రిటర్నింగ్ అధికారి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని బీజేపీ అభ్యర్ధి ఆరోపించారు.టీఆర్ఎస్ అభ్యర్ధి మీనా ఉపేందర్ రెడ్డికి రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రం అందించారు.