హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో రిసార్ట్ రాజకీయాలను టీఆర్ఎస్ నడుపుతున్న విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

సోమవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. స్థానిక నేతలను నిజామాబాద్ లో టీఆర్ఎస్ నేతలు రిసార్ట్స్ కు రప్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

నిజామాబాద్ లో టీఆర్ఎస్ రిసార్ట్ లో క్యాంప్ రాజకీయాలు నడుపుతున్నట్టుగా ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన అధికారులను ప్రశ్నించారు. 
సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అమలు కావా అని  ఆయన అడిగారు. ఈ నెల 9వ తేదీన నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

గతంలోనే ఈ ఎన్నిక జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ ఎన్నికను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేశారు.టీఆర్ఎస్ అభ్యర్ధిగా సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత ఈ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. భూపతిరెడ్డిపై అనర్హత కారణంగా ఈ స్థానానికి ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారు.

బీజేపీ నుండి యెండల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నుండి సుభాష్ రెడ్డి బరిలో ఉన్నారు.