Asianet News TeluguAsianet News Telugu

లోక్‌సభ ఎన్నికల్లో కారుకు బ్రేకులు: స్థానిక ఎన్నికల్లో పెరిగిన స్పీడ్

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో  టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 32 జిల్లా పరిషత్‌లను టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క జడ్పీ పీఠం కూడ దక్కలేదు

TRS sweeps local body elections
Author
Hyderabad, First Published Jun 5, 2019, 1:02 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో  టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 32 జిల్లా పరిషత్‌లను టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. కాంగ్రెస్ పార్టీకి ఒక్క జడ్పీ పీఠం కూడ దక్కలేదు. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీకి నామ మాత్రంగానే స్థానాలు దక్కాయి. ఖమ్మం జిల్లాలోనే కమ్యూనిష్టులకు స్థానాలు దక్కాయి. టీజేఎస్ మాత్రం ఖాతా తెరవలేదు.

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్‌కు 447 జడ్పీటీసీ స్థానాలు దక్కాయి. 3556 ఎంపీటీసీ స్థానాలు గులాబీ ఖాతాలో చేరాయి. కాంగ్రెస్ పార్టీకి 77 జడ్పీటీసీ, 1377 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే దక్కాయి.

బీజేపీ కేవలం 8 జడ్పీటీసీ, 211 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. ఇక టీడీపీకి ఒక్క జడ్పీటీసీ స్థానం కూడ దక్కలేదు. కేవలం  21 ఎంపీటీసీ స్థానాలతోనే టీడీపీ సరిపెట్టుకొంది. ఇతరులు 5 జడ్పీటీసీ, 573 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందారు. టీజేఎస్‌కు ఒక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానం కూడ దక్కలేదు.

రాష్ట్రంలోని 32 జడ్పీ పీఠాలను దక్కించుకొంది 382 ఎంపీపీ స్థానాలను కూడ టీఆర్ఎస్ కైవసం చేసుకొంది. రెబెల్స్, ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల మద్దతుతో మరికొన్ని ఎంపీపీ స్థానాలను కూడ టీఆర్ఎస్ కైవసం చేసుకొనే అవకాశం లేకపోలేదు.

ఐదు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క జడ్పీటీసీ స్థానం కూడ దక్కలేదు. మహబూబ్ నగర్, కరీంనగర్,వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్,జోగులాంబ గద్వాల జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం దక్కలేదు.  

మూడు జిల్లాల్లో మాత్రమే బీజేపీకి 8 జడ్పీటీసీ స్థానాలు దక్కాయి. ఆదిలాబాద్‌లో 5, నిజామబాద్ లో రెండు, నారాయణపేటలో 1 జడ్పీటీసీ స్థానాలను బీజేపీకి దక్కాయి. 

భద్రాద్రి కొత్తగూడెం, కొముర్రం భీమ్ ఆసిఫాబాద్,జనగామ, మెదక్, మేడ్చల్,నల్గొండ, సిద్దిపేట, పెద్దపల్లి,సూర్యాపేట, సంగారెడ్డి,వికారాబాద్, యాదాద్రి భువనగరి,వనపర్తి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్,మంచిర్యాల, మహబూబ్ నగర్, జగిత్యాల, ఖమ్మం జిల్లాల్లో బీజేపీకి ఒక్క జడ్పీటీసీ దక్కలేదు.

తెలంగాణలో టీడీపీ ఉనికే లేకుండా పోయిందని చెప్పొచ్చు. 500 ఎంపీపీ, 180 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. కానీ, టీడీపీకి ఒక్క జడ్పీటీసీ స్థానం దక్కలేదు.కేవలం 21 ఎంపీటీసీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో 11, సూర్యాపేటలో 3, కరీంనగర్ లో1, మహబూబాబాద్ లో 1,ఖమ్మంలో 5 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ నెగ్గింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లెఫ్ట్ పార్టీలకు 84 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల లెఫ్ట్ పార్టీలు కొన్ని స్థానాల్లో గెలిచాయి. తెలంగాణ జన సమితికి ఒక్క జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానం కూడ దక్కలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios