హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికలకు చాలా ముందుగానే 105 మంది అభ్యర్థులను ప్రకటించి ఘన విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. శాసన మండలికి జరిగే ఎన్నికల్లో పోటీకి దింపే 15 మంది అభ్యర్థులను పేర్లను ఆయన ఖరారు చేయడానికి సిద్ధపడ్డారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఏడాది మార్చిలో జరిగే అవకాశం ఉంది. దీంతో చాలా ముందుగానే ఫిబ్రవరి రెండో వారంలోనే కేసీఆర్ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని భావిస్తున్నారు. 

ఓ నామినేటెడ్ ఎమ్మెల్సీ సీటుతో పాటు 16 ఎమ్మెల్సీ సీట్లు మార్చి 29వ తేదీనాటికి ఖాళీ అవుతున్నాయి.  వాటిలో ఐదు శాసనసభ్యుల కోటా కింది సీట్లు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు, ఒకటేసి గ్రాడ్యుయేట్స్, హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గాలు ఖాళీ అవుతున్నాయి.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై టీఆర్ఎస్ కు చెందిన రాములు నాయక్, భూపతి రెడ్డి, కె. యాదవ రెడ్డిలను మండలి చైర్మన్ స్వామి గౌడ్ అనర్హులుగా ప్రకటించారు. కాంగ్రెసులో చేరిన కొండా మురళి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 

మల్కాజిగిరి నుంచి శాసనసభకు ఎన్నికైన ఎం. హనుమంతరావు, కొడంగల్ నుంచి విజయం సాధించిన పి. నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. మునుగోడు నుంచి కాంగ్రెసు తరఫున పోటీ శాసనసభకు ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 

శాసన మండలికి ద్వైవార్షిక ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో, ఓ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో, స్తానిక సంస్థల నియోజకవర్గాలకు షెడ్యూల్ ను ప్రకటించింది. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 20వ తేదీన ప్రకటించనున్నట్లు తెలిపింది.