ఒకప్పుడు కేసీఆర్ ని తన దైవంగా పూజించి.. ఆయన కోసం ఏకంగా గుడి కూడా కట్టించాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు టీఆర్ఎస్ ను వీడుతూ నిర్ణయం తీసుకున్నారు. తనకు పార్టీలో కనీసం గుర్తింపు కూడా లేదని.. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ 
సంఘటన మంచిర్యాలలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

‘‘కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నాను. ఆయనకు గుడి కట్టి ఊరేగించాను. కనికరం చూపకపోవడంతో మనస్తాపం చెంది టీఆర్‌ఎ్‌సకు రాజీనామా చేశాను’’ అని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త, కేసీఆర్‌ వీరాభిమాని గుండా రవీందర్‌ అన్నారు.

 కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకునేందుకు కేసీఆర్‌కు దండేపల్లిలో ఏకంగా గుడి కట్టించానని, ఆయన విగ్రహానికి నిత్యం పూజలు జరిపించానన్నారు. అంతటి అభిమానం పెంచుకున్న తనను పార్టీ గుర్తించకపోవడంతో ఆవేదనకు గురై రాజీనామా చేశానని చెప్పారు. బతుకుదెరువు కోసం తాను ఏర్పాటు చేసుకున్న డిష్‌ను వ్యాపారి బలవంతంగా లాక్కున్నా ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆరోపించారు. 

తన బాధలను కేసీఆర్‌కే చెప్పుకుందామంటే ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదన్నారు. టీఆర్‌ఎ్‌సలో చాలా మంది ఉద్యమకారులు ప్రస్తుతం తనలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారని తెలిపారు. తానే నిర్మించిన కేసీఆర్‌ గుడిలో ఆయన విగ్రహానికే తన రాజీనామా లేఖ సమర్పించానని తెలిపారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాలని వేడుకున్నారు.