Asianet News TeluguAsianet News Telugu

వరంగల్ టిఆర్ఎస్ కు ‘అచ్చ’ దెబ్బ

అచ్చ విద్యాసాగర్ కాంగ్రెస్ లో చేరితే.. టిఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయం రంజుగా మారనుందా?
TRS receives a jolt prominent leader Accha joins Congress

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చే వార్త ఇది. వరంగల్ జిల్లా కేంద్రంలోని తూర్పు నియోజకవర్గం నాయకుడు అచ్చ విద్యాసాగర్ టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరనున్నట్లు జిల్లాలో టాక్ నడుస్తోంది. ఈనెల 11న ఆయన గాంధీభవన్ లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అధికార పార్టీలో తనకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వరన్న ఉద్దేశంతోనే ఆయన టిఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు చెబుతున్నారు.

అచ్చ విద్యాసాగర్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 2009లో టిఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేశారు. అయితే ఆ సమయంలో ఆయన మీద బస్వరాజు సారయ్య కాంగ్రెస్ తరుపున పోటీ చేశారు. ఎన్నికల్లో బస్వరాజు సారయ్య గెలుపొందారు. తర్వాత బస్వరాజు సారయ్య మంత్రిగా నియమితులయ్యారు. ఇక తెలంగాణ వచ్చిన సందర్భంలో 2014లో అచ్చ మళ్లీ టిఆర్ఎస్ టికెట్ కోస ప్రయత్నం చేశారు. కానీ టికెట్ రాలేదు. కొండా సురేఖ టిఆర్ఎస్ లో చేరడంతో ఆమెకు వరంగల్ తూర్పు సీటు కేటాయించారు. ఆమె అక్కడ గెలుపొందారు. అయితే బంగారు తెలంగాణ కోసం అంటూ ఆ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య టిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో టిఆర్ఎస్ వరంగల్ తూర్పు నియోజకవర్గం హౌస్ ఫుల్ అయింది. దీంతో అచ్చ విద్యాసాగర్ తన సీటు కోసం ప్రయత్నం చేసినా టిఆర్ఎస్ అధిష్టానం నుంచి పెద్దగా స్పదన రాలేదు. దీంతో ఆయన టిఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర వరంగల్ వెళ్లిన సందర్భంలో కాంగ్రెస్ పెద్దలతో అచ్చ విద్యాసాగర్ చర్చలు జరిపినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి వరంగల్ తూర్పు టికెట్ హామీ లభించిందని, అందుకే ఆయన ఈనెల 11న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నారు. సుమారు 150 వాహనాల్లో వరంగల్ నుంచి భారీ కాన్వాయ్ తో వచ్చి కాంగ్రెస్ లో చేరేందుకు అచ్చ విద్యాసాగర్ అనుచర గణం ఏర్పాట్లలో మునిగిపోయింది.

అసలైన ట్విస్ట్ ఏమంటే.. ఇప్పటికే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కోసం ఇటీవల టిడిపి నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కూడా గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డితోపాటే కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ కు అత్యంత సన్నిహితుడుగా మెలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరి వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ దక్కుతుందా? లేక అచ్చ విద్యసాగర్ కు దక్కుతుందా అన్నది ఇప్పుడు పార్టీలోనే కాక వరంగల్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఇటు అధికార టిఆర్ఎస్ పార్టీలోనూ వరంగల్ తూర్పు నుంచి ఇటు కొండా సురేఖతోపాటు బస్వరాజు సారయ్య కూడా లైన్ లో ఉన్నారు. అలా అని ప్రతిపక్ష కాంగ్రెస్ లో కూడా అచ్చ, వేం బలమైన అభ్యర్థులే బరిలోకి దిగాలనుకోవడంతో రాజకీయం రంజుగా మారుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios