హైదరాబాద్: ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాజ్యసభ టికెట్ ఇస్తారని అందరూ గట్టిగా నమ్ముతూ వచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బహుశా ఆ విశ్వాసంతోనే ఉండి ఉంటారు. అయితే, చివరి నిమిషంలో కేసీఆర్ ఆయనకు షాక్ ఇచ్చారు. 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పక్కన పెడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన కేఆర్ సురేష్ రెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇచ్చి సురేష్ రెడ్డిని శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయిస్తారని అందరూ భావించారు. అయితే, అందరి నమ్మకాలను తలకిందులు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. 

See Photos: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులకు బావా బామ్మర్ధుల అభినందనలు (ఫోటోలు)

ఈ స్థితిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కార్యకర్తలకు ఓ విజ్ఞప్తి చేశారు.  అభిమానులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని ఆయన కోరారు. మనమంతా పార్టీా అధినేత కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. కేసీఆర్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు. 

రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కే. కేశవరావు, సురేష్ రెడ్డి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దానికి ముందు వారు గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. 

Also read: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు: కేకేకు మరో ఛాన్స్, పెద్దల సభకు సురేష్ రెడ్డి

లోకసభ ఎన్నికలకు ముందు తాను ఇచ్చిన హామీ మేరకు సురేష్ రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాలోని రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఆ పనిచేసి ఉండవచ్చునని అంటున్నారు.