హైదరాబాద్: రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులను  ప్రకటించింది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కే.కేశవరావుతో పాటు కేఆర్ సురేష్ రెడ్డికి టిక్కెట్లను ఖరారు చేసింది. ఈ రెండు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలో పడనున్నాయి.  

తెలంగాణ రాష్ట్రం నుండి   రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలను  టీఆర్ఎస్  గెలుచుకొంటుంది.  కేశవరావుకు రెండోసారి రాజ్యసభ  టిక్కెట్టును కేసీఆర్ కట్టబెట్టనున్నారు. 

2018 డిసెంబర్ మాసంలో జరిగిన ఎన్నికల సమయంలో సరేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు.  సురేష్ రెడ్డి ఉమ్మడి ఏపీ  రాష్ట్రంలో అసెంబ్లీకి స్పీకర్ గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున  పోటీ చేయడం లేదు. ఈ నెల 13వ తేదీన టీఆర్ఎస్ అభ్యర్థులు కేశవరావు, సురేష్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేస్తారు.

Also read:రాజ్యసభకు ఇద్దరు ఖరారు: దేశపతి శ్రీనివాస్ కు కేసీఆర్ బంపర్ ఆఫర్

పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కేశవరావుకు మరోసారి కేసీఆర్ రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ పార్టీని వీడిన సురేష్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని  కేసీఆర్  హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు రాజ్యసభకు పంపాలని కేసీఆర్ అవకాశం కల్పించారు.

ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ కొద్దిసేపు స్పీకర్ చాంబర్లో ఆయనతో భేటీ అయ్యారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడ జరగనున్నాయి. ఈ తరుణంలో ఇదే జిల్లా నుండి రాజ్యసభకు పంపాలని నిర్ణయం తీసుకొన్నారు. 

నిజామాబాద్ ఎంపీగా గతంలో పనిచేసిన కవితకు కూడ రాజ్యసభ అవకాశం దక్కుతోందని ప్రచారం సాగింది. కానీ అదే జిల్లా నుండి సురేష్ రెడ్డికి కేసీఆర్ అవకాశం కల్పించారు. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఎవరిని ఎంపిక చేస్తారోననే చర్చ సాగుతోంది.

రెండో దఫా రాజ్యసభ అవకాశం దక్కుతోందని తెలిసి కేకే ఇప్పటికే తిరుపతికి కూడ వెళ్లి వచ్చారు.  గురువారం నాడు మధ్యాహ్నం కేసీఆర్ తో కలిసి కేకే అసెంబ్లీకి వచ్చారు.