తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత కొంతకాలంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక రకంగా ఆయన బీజేపీపై పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం కలిసివచ్చే పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత కొంతకాలంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక రకంగా ఆయన బీజేపీపై పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం కలిసివచ్చే పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు పూర్తి మద్దతునిచ్చిన గులాబీ బాస్.. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. 

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించేందుకు మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశాలకు టీఆర్ఎస్ హాజరుకాలేదు. ఇందుకు కాంగ్రెస్ పార్టీతో వేదిక పంచుకోవడం ఇష్టం లేకపోవడమే కారణమని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అయితే విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మాత్రం.. టీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. పలువురు టీఆర్ఎస్ ఎంపీలో కూడా సిన్హా నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. 

రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ ఘన స్వాగతం పలకడంతో పాటుగా.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో దేశంలోని అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు.. వారి మనస్సాక్షి ప్రకారం ఓటు వేసి సిన్హాను భారత రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

అయితే ఇప్పుడు.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ఏకాభిప్రాయం సాధించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం కేసీఆర్.. కొన్ని బీజేపీయేతర పార్టీల నేతలతో ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపినట్టుగా ఓ ఆంగ్ల మీడియా పేర్కొంది. కొంతకాలంగా బీజేపీపై పోరాటం చేస్తున్న కేసీఆర్.. ఉపరాష్ట్రపతి ఎన్నికలను ఉపయోగించుకుని బీజేపీయేతర పార్టీలను ఏకం చేయాలని భావిస్తున్నారని సమాచారం. 

బీజేపీయేతర పార్టీల నేతలు ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీలో సమావేశమై ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీజేపీయేతర పార్టీల అభ్యర్థిని నిలబెట్టడం, అభ్యర్థిని ఖరారు చేయడంపై చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనే దానిపై మాత్రం స్పష్టత లేదు. అయితే పార్టీ నుంచి ఓ సీనియర్ ఎంపీని కేసీఆర్ ఈ సమావేశానికి పంపే అవకాశం ఉంది. 

ఇక, పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌కు మొత్తం 16 మంది ఎంపీల బలం ఉన్నారు. అందులో తొమ్మిది మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు.


ఇక, 2017లో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్థి వెంకయ్య నాయుడుకు టీఆర్ఎస్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలలో పలు పార్టీల మద్దతుతో మహాత్మా గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ‌పై వెంకయ్యనాయుడు విజయం సాధించారు. ఇక, ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి ఎన్నికకు జూలై 5వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 19 చివరి తేదీ కాగా.. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22 వరకు గడువు ఉంటుంది. ఆగస్టు 6న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ జరగనుంది.