నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి లక్ష్మీపుత్రుడు అని తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ లో టీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న గులాబీ బాస్ నాగర్ కర్నూల్ ప్రాంతంలో మంచి భూములు ఉన్నాయని నీళ్లు ఉంటే బాగా పండుతాయని భావించానని తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కల్వకుర్తి కాల్వ నిండింది 70 వేల ఎకరాలు సాగుపండుతుందని తెలిపారు. 

మర్రి జనార్థన్ రెడ్డి లక్ష్మీపుత్రుడు అని ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు కల్వకుర్తి కాల్వ నిండా నీళ్లు వచ్చాయన్నారు. ఒకసారి వట్టెం పూర్తయిపోతే నాగర్‌కర్నూల్ బంగారం అయిపోతుందన్నారు. రైతులు బాగుపడతారని చెప్పుకొచ్చారు. 

అది జరగాలని తాను కల కంటున్నానని అయితే మీ అందరి దయ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపిస్తే ఏడాదిన్నర లోపు వట్టెం మెుత్తం పూర్తి చేసి శ్రీశైలం నింపి మీ పాదాలు కడుగుతామన్నారు. మర్రి జనార్థన్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని కోరారు.  

తాము ఎంతో కష్టపడి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్‌ను తానే కట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు కరెంట్‌ను ఎక్కడ పెట్టాడో చెప్పాలని సీఎం ప్రశ్నించారు. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్నట్లు ప్రజలకు తెలిపారు. 

దేశంలో ఏ రాష్ట్రం అమలు చెయ్యని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.1000 పెన్షన్ ఇస్తున్నారా..?అని ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం లక్ష నూట పదహార్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. 

ప్రపంచం మొత్తంలో రైతు బంధు స్కీం ఎక్కడైనా ఉందా..? రైతులను ఎవరైనా పట్టించుకున్నారా అంటూ ప్రశ్నించారు. భూములు పట్టా చేయిమంటే చేశారా కానీ తమ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేసిందన్నారు. 

90 శాతం భూములు పరిష్కారం అయ్యాయని ఇంకా 10 శాతం ఉన్నాయని చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలిన భూముల సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ వచ్చి రైతు బంధు చెక్కులను మర్రి జనార్థన్ రెడ్డి చేతుల్లో పెట్టామన్నారు. రైతు బంధ పథకం, రైతు భీమా పథకం ఇంతకంటే గొప్ప పథకాలు ఉన్నాయా అంటూ ప్రజలను అడిగారు.  
 
తెలంగాణలో కరెంట్ లేదని ప్రధాని మోదీ అబద్దాలు చెప్తున్నాడని మండిపడ్డారు. ప్రధాని మోదీకి ప్రజలంతా బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్టీలు, అభ్యర్థులు గెలవడం కాదు ప్రజలు గెలివాలని సూచించారు. 58 ఏళ్లు పాలించిన కాంగ్రెస్,టీడీపీ ఒకవైపు పదిహేనేళ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించి నాలుగేళ్లు పాలించిన టీఆర్ఎస్ మరోవైపు ఉందని ఎవరు ఏం చేశారో ఆలోచించి ఓటెయ్యాలని కోరారు.