హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్లీనరీకి హైదరాబాదు సమీపంలోని కొంపల్లిలో పూర్తి ఏర్పాట్లు జరిగాయి. ఈ ప్లీనరీ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జాతీయ స్థాయిలో తాను చేపట్టబోయే ఫెడరల్ ఫ్రంట్ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది.

కేసిఆర్ ప్రకటించబోయే ఫెడరల్ ఫ్రంట్ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. శుక్రవారం జరిగే ఒక్క రోజు ప్లీనరీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. 

వివిధ అంశాలపై తొమ్మిది కమిటీలు ప్రతిపాదించే తీర్మానాలను ప్లీనరీలో ఆమోదించే అవకాశం ఉంది. బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా తాను ఏర్పాటు చేయబోయే ఫెడరల్ ఫ్రంట్ తీరుతెన్నులపై కేసిఆర్ ప్రకటన చేస్తారు. 

గత 70 ఏళ్ల కాలంలో ప్రజల సమస్యలను తీర్చలేకపోయిన బిజెపి, కాంగ్రెసు పార్టీలకు వ్యతిరేకంగా దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తేవడానికి కేసిఆర్ ఈ ఫ్రంట్ ఏర్పాటును తలపెట్టినట్లు మంత్రి కెటి రామారావు చెప్పారు. 

దాంతో పాటు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ప్లీనరీలో చర్చిస్తారు. భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికే టీఆర్ఎస్ సిద్ధపడినట్లు తెలుస్తోంది. 

తనను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారనే ప్రచారాన్ని కెటిఆర్ తోసిపుచ్చారు. కేసిఆర్ స్వయంగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించగలరని ఆయన అన్నారు.