పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రత్యర్థి పార్టీలకు సహకరిస్తున్నారనే ఆరోపణలపై 29 మంది కార్యకర్తలను టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మహబూబాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రెబల్స్‌గా పోటీచేయడంతో పాటు వారికి సహకరించిన 29 మంది కార్యకర్తలను సస్పండె చేసినట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెల్లడించారు.

టీఆర్ఎస్ అభ్యర్థులకు పోటీగా రెబల్స్‌గా బరిలోకి దిగడంతో పాటు నామినేషన్ సైతం ఉపసంహరించుకోలేదు. వీరికి మద్దతుగా నిలిచిన మరికొందరు మొత్తం 29 మందిని ఆరేళ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ తీర్మానాన్ని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లు మండల కమిటీ ప్రకటించింది. దీనితో పాటు రెబల్ అభ్యర్థులు సీఎం కేసీఆర్, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఫోటోలతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోవడానికి వీల్లేదని ఉత్తర్వుల్లో తెలిపారు.