టిఆర్ఎస్ లో ఇంకా పాత వాసనేనా?

TRS party is not able to wriggle out of old system of districts
Highlights

  • ఏడాది దాటినా పాత జిల్లాల ప్రాతిపదికన టిఆర్ఎస్ వ్యవహారాలు
  • టిఆర్ఎస్ లో మొదలు కాని కొత్త జిల్లాల హడావిడి

కొత్త జిల్లాల పాలనకు టిఆర్ఎస్ పార్టీ ఇంకా అలవాటు కాలేదా? ఇంకా పాత జిల్లాల ప్రకారమే టిఆర్ఎస్ వ్వవహారాలు ఎందుకు నడుస్తున్నాయి? ప్రభుత్వంతోపాటు టిఆర్ఎస్ పార్టీకి కూడా విభజన సవాళ్లు చుట్టుముడుతున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది.   

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక చర్యల్లో కొత్త జిల్లాల ఏర్పాటు ఒకటి. గత దసరా నాడు కొత్త జిల్లాలకు ప్రాణం పోసింది సర్కారు. ఈ దసరా నాటికి ఏడాది గడిచింది. పది జిల్లాలను 31 జిల్లాలకు పెంచింది. కానీ పాలన కొత్త జిల్లాలకు బదలాయింపు ఇంకా పూర్తయిన పరిస్థితి కనిపిస్తలేదు. సర్కారు యుద్ధ ప్రాతిపదికన కొత్త జిల్లాలకు మారే ప్రయత్నం చేస్తున్నా... ఆచరణలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

మొన్నటికి మొన్న కొత్త జిల్లాల ప్రాతిపదికన టీచర్ పోస్టుల భర్తీ నోటీఫికేషన్ టిఆర్టి ప్రకటన వెలువరించింది సర్కారు. కానీ ఆచరణలో దానికి చట్టబద్ధత లేదని హైకోర్టు అభ్యంతరం తెలిపింది. వెంటనే టిఆర్టి నోటిఫికేషన్ సవరించి 10 జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై తెలంగాణ సర్కారు మల్లగుల్లాలు పడుతున్నది. సవరణ నోటిఫికేసన్ జారీ చేయడమా? లేక కొత్తజిల్లాల మనుగడకు చట్టబద్ధత తెచ్చి మళ్లీ 31 జిల్లాలలతోనే నోటిఫికేషన్ ఇవ్వడమా అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నది సర్కారు. అయితే సిఎం కేసిఆర్ మాత్రం కొత్త జిల్లాల ప్రాతిపదికనే మరోసారి నోటిఫికేషన్ జారీ చేయాలన్న ధృడ సంకల్పంతో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ వివాదం ఇంకా ఒక కొలిక్కి వచ్చిన పరిస్థితి లేదు.

ఇదిలా ఉంటే పాత జిల్లాల స్వరూపం మారిపోయి 14 నెలలు గడుస్తున్నా.. టిఆర్ఎస్ పార్టీలో ఇంకా పాత జిల్లాల ప్రకారమే పరిపాలన సాగిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం అనీ... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం అని అంటూ ఇంకా ఉమ్మడి జిల్లాల టిఆర్ఎస్ సమావేశాలే జరుపుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా సమావేశం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి తోపాటు ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా పార్టీ ఇంచార్జీ, పార్టీ రాష్ర్ట ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నార‌దాసు ల‌క్ష్మ‌ణ్‌రావు పాల్గొన్నారు. బంజారాహిల్స్ లోని మినిస్ట‌ర్స్ క్వార్ట‌ర్స్ లో ఈ ఉమ్మడి భేటీ జరిగింది. పాత జిల్లా ముఖ్య నేత‌లంతా హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా టీఆర్ ఎస్ పార్టీ ని మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి అనుస‌రించాల్సిన వ్యూహాన్ని ర‌చించారు. ఇక నుంచి త‌ర‌చుగా స‌మావేశం కావాల‌ని నిర్ణ‌యించారు. క్షేత్ర స్థాయి నుంచి కార్య‌క‌ర్త‌ల‌ను, నాయ‌కుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకుని ప్ర‌భుత్వ అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యించారు. త్వ‌ర‌లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని, ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌ల అనంత‌రం మంచిర్యాల జిల్లాలో పార్టీ స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని స‌మావేశంలో తీర్మానించారు.

ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వ విప్ న‌ల్లాల ఓదేలు,  ఎమ్మెల్యేలు కోనేరు కోన‌ప్ప‌, దివాక‌ర్ రావు, విఠ‌ల్ రెడ్డి, రాథోడ్ బాపురావు, దుర్గం చిన్న‌య్య‌, కోవ ల‌క్ష్మీ, రేఖా నాయ‌క్‌, డైరీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ లోక భూమా రెడ్డి, ఫిలీం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ రామ్మోహ‌న్ రావు, పార్టీ నియోజ‌క‌వ‌ర్గ‌ ఇంచార్జీలు అరిగెల నాగేశ్వ‌ర్ రావు, మూల విజ‌య రెడ్డి, విఠ‌ల్ రావు, ల‌కే రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

loader