Telangana: తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు, పార్ల‌మెంట్ స‌భ్యుడు రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీని లూటీ చేసేందుకు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కుట్ర ప‌న్నుతోంద‌ని ఆరోపించారు.  

Telangana: సింగరేణి కాలరీస్ కంపెనీని లూటీ చేసేందుకు అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఆ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర టీఆర్ఎస్ ప్ర‌భుత్వ అవినీతి విష‌యంలో కేంద్రం చూసిచూడ‌నట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు. బొగ్గు గ‌నుల టెండ‌ర్ల విష‌యంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌నీ, సీఎం కేసీఆర్ ఆయ‌న స‌న్నిహితుల‌కు టెండ‌ర్లు అందేలా కుట్ర‌కు తెర‌లేపార‌ని ఆరోపించారు. 

ఈ అంశంపై ప్రధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌కు పలుమార్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసినా స్పందన లేదన్నారు. టెండ‌ర్ల కేటాయింపు నిబంధనలను ఉటంకిస్తూ, బొగ్గు గనులను ప్ర‌యివేటు కంపెనీల‌కు కేటాయించేటప్పుడు సంబంధిత అధికారులు జాయింట్ వెంచర్ మరియు కన్సార్టియం నిబంధనలను పాటించాలని, నిబంధనలను పాటించడం వల్ల వివిధ బిడ్డర్‌ల మధ్య పోటీ పెరుగుతుందని తద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అన్నారు.

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) సీఎండీ ఎన్.శ్రీధర్‌పై కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఎన్.శ్రీధర్‌ను ఏడేళ్ల సర్వీసు పూర్తయినా డీఓపీటీ నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ అదే పదవిలో కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కంపెనీలో 49 శాతం వాటా ఉన్నప్పటికీ టెండర్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరలేదని, సీఎండీ పదవి నుంచి శ్రీధర్‌ను తొలగించాలని కోరలేదన్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మొత్తం సమస్యపై నివేదిక ఇవ్వాలని తాము చేసిన విజ్ఞప్తిని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. బొగ్గు గని టెక్నికల్ బిడ్ మరియు ప్రైస్ బిడ్ ఇప్పుడు పూర్తయిందని, నైని బొగ్గు గనిలో మెట్రిక్ టన్ను బొగ్గు ₹1093కి బిడ్ దాఖలయ్యిందని, పొరుగున ఉన్న సుభద్ర బొగ్గు గని కేవలం ₹490కి బిడ్ దాఖలయ్యిందని తెలిపారు. 

అవినీతికి పాల్పడిన కేసీఆర్, ఆయన కుటుంబం జైలుకు వెళ్తుందని బండి సంజయ్ లాంటి రాష్ట్ర బీజేపీ నేతలు పదే పదే చెబుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను జైలుకు ఎందుకు పంపడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ నేతలను ప్రశ్నించారు. నైని బొగ్గు గనుల వ్యవహారంలో బలమైన సాక్ష్యాధారాలు బయటపెట్టినా జైలుకే? కానీ, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని, నైని బొగ్గు ప్రైవేటీకరణ పేరుతో రెండు రాజకీయ పార్టీలు చేతులు కలిపి అక్రమార్జనకు పాల్పడ్డాయని ఆరోపించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్‌ నిధులు సమకూరుస్తున్నారని ఆరోపించారు. 

రాష్ట్రాన్ని దోచుకోవడంలో కమలం, గులాబీ పార్టీలు కుమ్మక్కైయ్యాయని దుయ్యబట్టారు. సింగరేణి దోపిడీలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా వాటా ఉందని రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు . ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుచరులకే ఈ కాంట్రాక్టులు దక్కాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.