హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆ టీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించింది టీఆర్ఎస్. 

ఆంధ్రలో ఓట్లు దండుకునేందుకు కేసీఆర్‌పై నోరు పారేసుకుంటే ఊరుకోబోమని టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్థాన్ తో పవన్ పోల్చారంటూ టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

శాంతి భద్రతల విషయంలో నంబర్‌ వన్‌గా ఉన్న తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చడం గర్హనీయమంటూ మండిపడింది. ఆంధ్ర- తెలంగాణ ప్రజల మధ్య చిచ్చురేపి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు జనసేన, టీడీపీ కుట్ర పన్నుతున్నాయని గ్యాదరి ఆరోపించారు. 

అందులో భాగంగానే చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కేసీఆర్‌పై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ అడ్వకేట్స్‌ జేఏసీ జూబ్లీహిల్స్‌ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

మరోవైపు టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు వీరమళ్ల రాంనర్సింహాగౌడ్ చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ పై నిరాధార ఆరోపణలు చెయ్యడంతోపాటు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారని వాటిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.