తెలంగాణలో బీజేపీ vs టీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం తర్వాత భారతీయ జనతా పార్టీ మంచి జోష్‌లో ఉంది. టీఆర్ఎస్ నేతలపై మాటల యుద్ధం చేస్తోంది.. గులాబీ పార్టీని డిఫెన్స్‌లో పడేస్తోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ఇది తారా స్థాయిని చేరుకుంది. ఇప్పటికే బండి సంజయ్ చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కామెంట్స్‌తో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఆయన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ సైతం ఇచ్చారు. 

తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై రాష్ట్ర డీజీపీకి టీఆర్ఎస్ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. తమ పార్టీకి సంబంధించిన బ్యానర్లను పెట్టుకోవడానికి లీగల్ గా అన్ని పర్మిషన్లు ఉన్నా వాటిని చింపడంపై ఫిర్యాదు చేసింది.

Also Read:పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్: బండి సంజయ్‌కి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్న ఫ్లెక్సీలను తన అనుచరులతో కలిసి చించివేశారు ఎంపీ అరవింద్. ఒక ఎంపీ అయివుండి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ లీగల్ సెల్ మండిపడింది.

అరవింద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. కాగా కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరిన సంగతి తెలిసిందే.