బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. సంజయ్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని... సర్జికల్ స్ట్రైక్స్ అంశాన్ని కిషన్ రెడ్డి సమర్ధిస్తారా అని ఆయన నిలదీశారు.

కొన్ని ఓట్లు, సీట్ల కోసం సంజయ్ ఇలా మాట్లాడటం సరికాదన్నారు. కాగా, గ్రేటర్ ఎన్నికల్లో తాము విజయం సాధించగానే పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని సంచలన వాఖ్యలు చేశారు.

ఓల్డ్ సిటీలో పాకిస్తానీలు, రోహింగ్యాలు నివాసం ఉంటూ ఓట్లు వేస్తున్నారని సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మేయర్ అవడం ఖామయని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.

రోహింగ్యాలు,పాకిస్తానీలు,ఆఫ్ఘనిస్తాన్ వాసులు ఓట్లు వేయని ఎన్నికలు జరగాలంటే... అది బీజేపీతోనే సాధ్యమన్నారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారని హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వేసిన ప్రశ్నకు సంజయ్ ఇలా కౌంటర్ ఇచ్చారు.

అంతకుముందు ఓటర్ల జాబితాలో కనీసం 30వేల నుంచి 40వేల మంది రోహింగ్యాలు ఉన్నారని కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఆరోపిస్తోందన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.

అదే నిజమైతే...ఓటర్ల జాబితాలో 1,000 మంది రోహింగ్యాల పేర్లు చూపించాలని ఆయన బీజేపీకి సవాల్ విసిరారు. పాతబస్తీలో అన్ని వేల మంది రోహింగ్యాలు ఉంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు.