హైదరాబాద్‌:  శానససభలో కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు పక్కా వ్యూహరచనే చేశారు. అందుకు 13 మంది శాసనసభ్యులు కాంగ్రెసు నుంచి టీఆర్ఎస్ లోకి రావాల్సి ఉంటుంది. 

ఇప్పటి వరకు 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధపడ్డారు. 13వ శాసనసభ్యుడి కోసం కేసీఆర్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ 13వ ఎమ్మెల్యే ఎవరనేది ఆసక్తికరంగా మారింది. భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి టీఆర్ఎస్ లో చేరినట్లే భావించవచ్చు. భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య కూడా టీఆర్ఎస్ లో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దాంతో కాంగ్రెసు నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చే ఎమ్మెల్యే సంఖ్య 12కు చేరుకుంటుంది. ఫిరాయింపుల చట్టాన్ని అధిగమించడానికి కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని (సీఎల్పీని) టీఆర్ఎస్ లో విలీనం చేయడానికి మరో ఎమ్మెల్యే అవసరం ఉంటుంది. ఆ 13వ ఎమ్మెల్యే కోసం ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారని మొదట ప్రచారం జరిగింది. అయితే, ఆయన ఈ విషయంపై ఏమీ తేల్చడం లేదు. తాను పార్టీ మారే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. పైగా, తాను పార్టీ మారడం లేదని చెప్పినా పుకార్లు ఆగడం లేదని, అందువల్ల దాని గురించి మాట్లాడదలుచుకోలేదని అన్నారు. 

అయితే, జగ్గారెడ్డికి టీఆర్ఎస్ నాయకత్వం గాలం వేయడం మాత్రం ఆపలేదు. అదే సమయంలో తాండూరు శాసనసభ్యుడు పైలట్ రోహిత్ రెడ్డికి కూడా టీఆర్ఎస్ నాయకత్వం గాలం వేస్తోంది. టీఆర్ఎస్ నాయకులు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారు.