షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణపై చర్చించాలని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా తీర్మానం ఇచ్చారు. టీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌‌సభ నుంచి వాకౌట్ చేశారు.

లోక్‌సభ నుంచి టీఆర్‌ఎస్ ఎంపీ వాకౌట్ చేశారు. షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణపై చర్చించాలని లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా తీర్మానం ఇచ్చారు. షెడ్యూల్డ్‌ కులాల వర్గీకరణ చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నదని, సభలో కార్యకలాపాలు సస్పెండ్‌ చేసి ఈ అంశంపై చర్చించాలని కోరారు. వర్గీకరణతో వారి జనాభా ప్రకారం చట్టబద్ధమైన ప్రయోజనాలు అందేలా, వెనుకబాటుదనాన్ని దూరం చేసేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ పంపించిన ఎస్సీ వర్గీకరణ తీర్మానంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌‌సభ నుంచి వాకౌట్ చేశారు.

అనంతరం లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని చేసి పంపిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై తేల్చాలంటూ టీఆర్‌ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని చెప్పారు. 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. కానీ ఆ హామీ అమలు చేయకుండా ఎస్సీలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. 

ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని 8 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ అధికారం కేంద్రం చేతుల్లో ఉందని అన్నారు.. కేంద్రానికి చేతకాకుంటే రాష్ట్రాలకు అధికారం అప్పగించాలని అన్నారు. రాష్ట్రానికి అధికారం ఇస్తే 24 గంటల్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామన్నారు. కేంద్రం వైఖరిని ఎస్సీ వర్గాలు గమనించాలని కోరారు. ఇలాంటి కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. దళిత బంధు తరహాలో కేంద్రం కూడా ఎస్సీలకు పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.