మహిళను తన్నిన ఎంపీపీ అరెస్ట్

First Published 18, Jun 2018, 10:02 AM IST
TRS mpp gopi arrested over mis behaviour with women
Highlights

వైరల్ గా మారిన వీడియో


 మహిళను కాలితో ఛాతిపై తన్నిన నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి ఎంపీపీ ఇమ్మడి గోపీని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ధర్పల్లి మండల ఎంపీపీ ఇమ్మడి గోపికి ఇందల్‌వాయి మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారి పక్కన సర్వే నం.1107లో నాలుగెకరాల స్థలం ఉంది. 

గతేడాది ఈ స్థలంలోని అతిథిగృహంతో పాటు 1125 గజాలను రూ.33.72 లక్షలకు తనకు విక్రయించినట్లు గౌరారం గ్రామానికి చెందిన ఒడ్డె రాజవ్వ పేర్కొంటున్నారు. అయితే ఎంపీపీ స్థలాన్ని అప్పగించకుండా అదనంగా రూ.65 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు వాపోయారు.

 ఈ క్రమంలో ఆదివారం గ్రామస్థులు, బంధువులతో కలిసి వచ్చిన రాజవ్వ అతిథిగృహం తాళాన్ని పగులగొట్టి సామగ్రిని బయటపడేశారు. సొమ్ము చెల్లించినా ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నావని రాజవ్వ ఎంపీపీపై చెప్పుతో దాడి చేశారు.

 ఈ చర్యలతో ఆగ్రహించిన ఆయన కాలితో మహిళను బలంగా తన్నడంతో ఆమె ఎగిరిపడ్డారు. అనంతరం రాజవ్వతో పాటు వచ్చినవారు ఎంపీపీని గట్టిగా నెట్టేయడంతో ఆయన పడిపోయారు. ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీసుస్టేషన్‌లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు.

అయితే ఓ మహిళ అని కూడా చూడకుండా ఎంపీపీ రాజవ్వను కాలితో తన్నడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆయన తీరును రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఎంపీపీ తీరుకు నిరసనగా కాంగ్రెస్‌ శ్రేణులు ఈ రోజు ఇందల్వాయి మండలంలో బంద్‌ చేపట్టాయి.

loader