హైదరాబాద్: కేంద్ర మంత్రులు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. 

శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కేంద్ర  ప్రభుత్వం తెలంగాణకు బాకీ ఉందన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటా ను కూడ కేంద్రం నుండి ఇవ్వడం లేదన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల మద్దతు ఉంటే  కేంద్ర మంత్రులను బీజేపీ ఎందుకు ప్రచారానికి వినియోగించుకొంటుందని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర మంత్రులు తెలంగాణ గురించి ఏనాడైనా మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు.  రాష్ట్రానికి కేంద్రం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని ఆయన బీజేపీ నేతలను అడిగారు. 

రాష్ట్రంలో వరద సహాయం ఇవ్వాలని కోరితే  కేంద్రం ఒక్క పైసా కూడ ఇవ్వలేదన్నారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇచ్చి తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అభివృద్ది అంటే హైద్రాబాద్ అని ఆయన చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం  చేయాల్సిన అవసరం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

ఆరేళ్లలో హైద్రాబాద్ గణనీయంగా అభివృద్ది చెందిందన్నారు. .జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకొని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన కోరారు.