రాష్ట్రం విడిపోయి ఆరేళ్లవుతున్నా కేంద్రప్రభుత్వం విభజన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని మండిపడ్డారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగిన ఎంపీల సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా విభజన చట్టంలో పేర్కొన్న ఖాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఎక్కడి వరకు వచ్చిందని దక్షిణ మధ్య రైల్వే జీఎంను నామా ప్రశ్నించారు. ఏర్పాటుకు వ్యయం ఎంత అవుతుందని.. దానికి ఉన్న అడ్డంకులు ఏమిటని ఆయన అధికారులను నిలదీశారు.

కొత్త రైల్వే లైన్లను సత్వరం పూర్తిచేయాలని నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. అలాగే రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం భూసేకరణ, వివిధ ప్రభుత్వ సంస్థల సమన్వయం కోసం ఇతర శాఖలతో కలిపి మరో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా నామా కోరారు.

ఖమ్మం రైల్వే స్టేషన్‌ అంతా నాలుగు గంటల పాటు తిరిగి సమస్యలను పరిశీలించి ప్రతిపాదనలను పంపానని ఎంపీ గుర్తు చేశారు. ఖమ్మం ఆటో స్టాండ్ లో షెడ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

నిధుల కోరత ఉంటే చెప్పండి, ఎంపీ ల్యాడ్స్ కింద షెడ్ ఏర్పాటు చేస్తానాని అధికారులకు స్పష్టం చేశారు. ముస్తాఫానగర్-శ్రీనివాసనగర్ రైల్వే అండర్ బ్రిడ్జ్(ఆర్ యూబీ) ని ఏర్పాటు చేయాలని సూచించారు.

భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ పనులు ఎక్కడి వరకు వచ్చాయని అధికారులను ఆయన ప్రశ్నించారు.డోర్నకల్-కారేపల్లి డబుల్ ట్రాక్ పనులు పూర్తి చేయాలని అని పేర్కొన్నారు. పాండురంగపురం-సారపాక ను త్వరితగతీన పూర్తి చేసి దాన్ని భద్రాచలం పట్టణం వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు.

డోర్నకల్-భద్రాచలం రోడ్ లైన్ లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. భద్రాచలం ,మణగూరు,కొత్తగూడెం ప్రజలు తిరుపతి దైవదర్శనం కోసం కొత్తగూడెం నుంచి వెళ్లే రైల్ కు అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

మధిర రైల్వే స్టేషన్ లో నవజీవన్ సూపర్ పాస్ట్,ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ ను నిలుపాలని కోరారు. ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ లో ఇంటర్ సీటీ ఎక్స్ ప్రెస్, శాతవాహన ఎక్స్ ప్రెస్ ను నిలుపాలని వివరించారు.

రద్దు చేసిన మణగూరు-ఖాజీపేట ప్యాసింజర్ రైల్,  భద్రాచలం రోడ్-విజయవాడ రైల్ ను పునరుద్ధరించాలని అధికారులకు తెలిపారు.

మణగూరు-కొల్హపూర్ ఎక్స్ ప్రెస్ రైల్ ను కారేపల్లి రైల్వే స్టేషన్ లో నిలుపాలని తెలిపారు.గాంధీపురం రైల్వే స్టేషన్ ను అభివృద్ది చేయాలని సూచించారు. ఖాజీపేట్ రైల్వే ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.