గతకొద్ది రోజులుగా తన పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఆదిలాబాద్ ఎంపి గోడం నగేష్ స్పష్టత ఇచ్చారు. తాను టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని...వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీనుండే ఎంపిగా పోటీ చేస్తానని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందని...అందులో భాగంగానే తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు దుష్ప్రచారం చేస్తోందని  నగేష్ తెలిపారు. 

తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వారి నీచమైన రాజకీయాల కోసం తన పేరు వాడుకొంటున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ముమ్మరంగా ప్రచారం చేశారని...ఆ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని నగేష్ వెల్లడించారు. ఇవాళ ఆదిలాబాద్‌లోని తన నివాసంలో నగేష్ మీడియాతో మాట్లాడారు. 

ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసే అవకాశం మళ్లీ తనకే వస్తుందని పూర్తి నమ్మకం ఉందని....భీపామ్ తన జేబులో ఉన్నట్లు భావిస్తున్నానని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము లేకే ఇలా టీఆర్ఎస్ నాయకులపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా కూటమిని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేవని నగేష్ వెల్లడించారు. తనపై మరోసారి తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని...వారిపై పరువు నష్టం దావా వేస్తానని నగేష్ హెచ్చరించారు. 

గతంలో టీఆర్ఎస్ పార్టీని ఇద్దరు ఎంపీలు వీడనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన అన్నట్లుగానే చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. దీంతో మరో ఎంపీ ఎవరా అని అటు ప్రజల్లోను...ఇటు నాయకుల్లోను చర్చ మొదలయ్యింది. ఈ క్రమంలో జహిరాబాద్ ఎంపి బి.బి.పాటిల్, సీతారాంనాయక్, జితేందర్ రెడ్డి ల్లో ఎవరో ఇకరు పార్టీ మారనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆదిలాబాద్ ఎంపి నగేష్ పేరు కూడా అందులో చేరింది. అయితే తాజాగా తాను పార్టీ మారడంలేదని నగేష్ ప్రకటించారు. 

మరిన్ని వార్తలు

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్

టీఆర్ఎస్ ఎంపీలే కాదు...ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి: రేవంత్ రెడ్డి