సింగరేణిలో కవిత జోరుగా ప్రచారం సింగరేణిలో టిబిజికెఎస్ గెలుపును ఏ శక్తీ ఆపలేదు వారసత్వ ఉద్యోగాలు పోగొట్టిందే ఎఐటియుసి
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టిబిజికెఎస్ గెలుపును ఏ శక్తీ ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు టిబిజికెఎస్ గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత. గోదావరిఖనిలోని ఆర్‌జి3, ఓపెన్‌కాస్ట్-1లో జరిగిన గేట్‌మీటింగ్‌లో ఆమె పాల్గొని కార్మికులనుద్దేశించి మాట్లాడారు. టిబిజికెఎస్ కార్మిక పక్షపాత సంఘం కావడమే జాతీయ సంఘాల కళ్లు బైర్లు కమ్ముతున్నాయన్నారు. వారసత్వ ఉద్యోగాల పేరు మారినా.. తండ్రీ కొడుకుల వారసత్వ ఉద్యోగాలు లభిస్తే మనకు అంతకన్నా కావలసింది ఏమీలేదన్నారు. కారుణ్య నియామకాల రూపంలో వారసత్వ ఉద్యోగాలను ఇస్తామని సిఎం కేసిఆర్ ఇచ్చిన హామీని కొందరు నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని కవిత విమర్శించారు. వారసత్వ ఉద్యోగాలను పోగొట్టిందే...ఏఐటియుసి అన్నారు. ఆ సంఘంతో జట్టుకట్టిన ఇతర సంఘాల నేతలు కూడా వారసత్వ ఉద్యోగాల రద్దు ఒప్పందంపై సంతకాలు చేసిన విషయం వాస్తవం కాదా అని కవిత ప్రశ్నించారు.
సకల జనుల సమ్మె లో భాగంగా సమ్మెలో పాల్గొన్న కార్మికులకు వేతనం చెల్లించిన మొదటి ప్రభుత్వం మనదేనన్నారు. అలాగే 175 కోట్ల రూపాయల ప్రొఫెషనల్ టాక్స్‌ను రద్దు చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ దేనన్నారు. పాత బకాయిలను కూడా రద్దు చేసిన విషయాన్ని ఆమె కార్మికులకు గుర్తు చేశారు. సింగరేణి లాబాల్లో వాటా చెల్లిస్తున్నారని, ఈ సారి 9 శాతంకు పెంచిన విషయం తెలుసునన్నారు. వారసత్వ ఉద్యోగాలు, అలియాస్ పేర్లతో పనిచేస్తున్నకార్మికులకు వారి స్వంత పేర్లతో పనిచేసేలా త్వరలో ఉత్తర్వులు వస్తాయన్నారు. కార్మికుల క్వార్టర్లకు ఏసి సౌకర్యం కల్పిస్తామని, పనిలోంచి దిగిపోయేప్పుడు ఇంటి కోసం చూడాల్సిన పనిలేకుండా రూ. 6 లక్షలు వడ్డీలేని రుణం ఇప్పిస్తామని, ఐఐటి, ఐఐఎం కోర్సుల్లో సీటు సంపాదించిన కార్మికుల పిల్లలకు ప్రస్తుతం పదివేల రూపాయలు ఇస్తున్నారని, ఆ మనీ సరిపోవన్నారు. వీరికి మొత్తం ఫీజును యాజమాన్యంతో రీఎంబర్స్‌మెంట్ చేయిస్తామని కవిత హామీనిచ్చారు.
కార్మికులు, వారి తల్లిదండ్రులకు మాత్రమే కార్పొరేట్ వైద్యం పొందే వీలు ఇప్పుడు ఉన్నదని, వారిపై ఆధారపడిన తల్లిదండ్రులకు సైతం ఆ సౌకర్యం కల్పిస్తామన్నారు. కోల్ ఇండియా తరహా కేడర్ స్కీం అమలు చేయిస్తామని, ఈపి ఆపరేరట్లకు వేజ్ ప్రొటెక్షన్ కల్పిస్తామని, గత మూడేళ్లలలో విధుల్లోకి తీసుకున్న బదిలీ వర్కర్లను జనరల్ మజ్ధూర్‌లు పర్మినెంట్ చేస్తామన్నారు. ఇన్‌కం టాక్స్ రద్దు కోసం అసెంబ్లీలో తీర్మాణం చేసి, కేంద్ర ఆర్థిక మంత్రికి ఆ కాపీని ముఖ్యమంత్రి కెసిఆర్ పంపిచారని కవిత తెలిపారు. గత పాలకులు, కొత్తగా నియామకాలు చేయకుండా లాభాల కోసం చూశాయని, దీనికి భిన్నంగా టిఆర్ ఎస్ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తూన్న విషయం మీకందరికీ తెలుసునన్నారు. గత ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను, సింగరేణి అభివృద్ధి నిరోధక చర్యలను పట్టించుకోలేదని, తద్వారా కార్మికులకు, సంస్థకు నష్టం జరిగిందని ఎంపి కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం పాటు పడుతున్న టిబిజికెఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే ఈ గెలుపుతో ముఖ్యమంత్రికి బాసటగా ఉన్నామన్న సంకేతాన్ని ప్రపంచానికి చాటినట్లవుతుందన్నారు. మంథని ఎమ్మెల్యే పుట్టామధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు గడ్డం వివేక్, రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసి ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, టిబిజికెఎస్ నాయకులు వెంకట్ రావు, మిరియాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్యతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఆర్‌జి3 ఓసిపి1 టిబిజికెఎస్ నాయకులు పాల్గొన్నారు.
