టీఆర్ఎస్ పార్టీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తన వృత్తిదర్మాన్ని పాటించి ప్రజాభిమాన్ని మరోసారి పొందారు. అయితే ఈసారి ఎంపీగా కాదు...ఓ డాక్టర్ గా ప్రజా సేవ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిని ఓ బాధితురాలికి నర్సయ్య గౌడ్ స్వయంగా ప్రథమ చికిత్స చేసి డాక్టర్ గా తన వృత్తిధర్మాన్ని నిర్వర్తించారు. ఈ  సంఘటన ద్వారా ప్రజాసేవకోసం తాను చూపించే నిబద్దతను ఈ టీఆర్ఎస్ ఎంపీ మరోసారి చాటుకున్నారు.    

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద ఓ శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంకు వెళుతున్న ద్విచక్రవాహనం ముందు వెళుతున్న మరో వాహనాన్ని ఢీ కొట్టడంతో అదుపుతప్పి ప్రమాదం జరిగింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న నాగమణి అనే మహిళకు తీవ్ర గాయాలవగా వెంకటేశ్వర్లు, నాగరాజులకు స్వల్పంగా గా గాయాలయ్యాయి. 

ఇదే సమయంలో హైదరాబాద్ నుండి సూర్యాపేట వైపు వెళుతున్న ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఈ ప్రమాద బాధితులను గమనించారు. బాధితురాలి గాయం కారణంగా రక్తస్రావం అవుతుండటంతో  ఎంపీ చలించిపోయారు. దీంతో వెంటనే తన వాహనాన్ని నిలిపి బాధితురాలు నాగమణికి ప్రథమ చికిత్స చేశాడు. అనంతరం అక్కడే వుండి అంబులెన్స్ ను పిలిపించి క్షతగాత్రురాలు నాగమణిని సమీప ఆసుపత్రికి తరలించారు.

ప్రజాప్రతినిధిగా నిత్యం బిజీగా వుండే నర్సయ్య గౌడ్ ఇలా ఓ బాధితురాలి కోసం సమయాన్ని కేటాయిస్తూ మానవత్వాన్ని చాటుకోవడాన్ని స్థానికులు ప్రశంసించారు. ఎంపీగానే కాకుండా ఓ డాక్టర్ గా సామాన్య పౌరుల పట్ల ఆయన చూపించిన ప్రేమ, శ్రద్ద తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని స్థానికులు తెలపారు.