అనారోగ్యంతో ఇటీవలే తుదిశ్వాస విడిచిన శ్రీసిద్దగంగ మఠాధిపతి  శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆద్యాత్మిక గురువు, సామాజిక సేవకులైన శివకుమారస్వామి భారతరత్న ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తరువాత చాలా మంది రాజకీయ నాయకులు, ఆద్యాత్మికవేత్తలు కూడా కుమార స్వామి ప్రతిపాదనకు మద్దతు పలికారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా లోక్ సభలో ఈ అంశంపై ప్రసంగించారు. 

జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బిబి. పాటిల్ లోక్ సభలో ప్రసంగిస్తూ ఇటీవల దివంగతులైన వీరశైవ లింగాయతుల ఆరాధ్య దైవం శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కేవలం ఓ మఠాధిపతిగానే కాకుండా ఓ సామాజికవేత్తగా, మానవతావాదిగా శివకుమార స్వామి ఎన్నో మంచి పనులు చేశారని గుర్తుచేశారు. 

శివకుమారస్వామి కర్ణాటకలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా విద్యాసంస్థలు ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థుల చదువుకోసం కృషిచేశారని అన్నారు. సిద్దగంగ మఠం ఆద్వర్యంలో దాదాపు 132 విద్యాసంస్థలు పనిచేస్తున్నాయని...వీటి  ద్వారా విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు ఇతర సదుపాయాలు కల్పించబడుతున్నాయని బిబి.పాటిల్ పేర్కొన్నారు. ఇలాంటి మహోన్నత ఆద్యాత్మిక గురువుకు భారతరత్న ఇవ్వాల్సిన అవసరం వుందని పాటిల్ కేంద్ర ప్రభుత్వానికి లోక్ సభ సాక్షిగా తెలియజేశారు. 

కర్ణాటక డిప్యూటి సీఎం పరమేశ్వరన్, యోగా గురువు రాంధేవ్ బాబా కూడా శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ కు ఇంతకుముందే మద్దతు పలికారు. వారితో పాటు కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ డిమాండ్ కు మద్దతు పలకగా తాజాగా ఆ జాబితాలో టీఆర్ఎస్ ఎంపీ చేరిపోయారు.