మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఐటీ, ఈడీ దాడులను టీఆర్ఎస్ పార్టీ ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. మనుగోడులో టీఆర్ఎస్ గెలుపు కోసం గంగుల కృషి చేశారని అందుకే బీజేపీ ఐటీ దాడులు చేయిస్తోందని వారు ఆరోపించారు.
బీసీలకు బీజేపీ వ్యతిరేకమని.. అందుకే అణగదొక్కాలని చూస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. బుధవారం వారు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ.. అందుకే మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఈడీ, ఐటీదాడులు చేయించారని మండిపడ్డారు. ఈడీ , ఐటీలకు ప్రతిపక్ష పార్టీలే కనిపిస్తున్నాయా అని వారు ప్రశ్నించారు. మనుగోడులో టీఆర్ఎస్ గెలుపు కోసం గంగుల కృషి చేశారని బీజేపీ ఓర్వలేకపోతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బీసీ నాయకుల మీద దాడులు చేసి లొంగదీసుకోవాలని చూస్తున్నారని వారు దుయ్యబట్టారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా.. టీఆర్ఎస్ అన్ని పార్టీలను ఏకం చేస్తుందని వారు స్పష్టం చేశారు. ఇకనైనా టీఆర్ఎస్ నేతలపై ఈడీ, ఐటీలతో దాడులు చేయించుకోవడం మానుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ప్రధానిగా తెలంగాణకు ఏం చేశారో చెప్పాల్సిన బాధ్యత మోడీపై వుందని ఎర్రబెల్లి దయాకర్ రావు చురకలంటించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు మోడీ నిలిపివేశారని.. బీజేపీ నేతలు మోసగాళ్లని ఆయన ఆరోపించారు. మోడీ తెలంగాణకు వచ్చే ముందు ఏం ఇచ్చారో , ఏం ఇస్తారో చెప్పాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. బీజేపీకి మునుగోడు జనం మంచి గుణపాఠం చెప్పారని దయాకర్ రావు దుయ్యబట్టారు.
ALso REad:గ్రానైట్ సంస్థల్లో సోదాలపై వాస్తవాలు బయట పెట్టాలి: మంత్రి గంగుల కమలాకర్
ఇకపోతే.. గ్రానైట్ సంస్థల్లో జరిపిన సోదాలకు సంబంధించి నిజనిజాలను తేల్చాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. గురువారంనాడు కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రోజులపాటు హైద్రాబాద్, కరీంనగర్ లలో మంత్రిగంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి కి చెందిన గ్రానైట్ సంస్థల కార్యాలయాల్లో ఈడీ, ఐటీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ కోసం హైద్రాబాద్ కు రావాలని దర్యాప్తు సంస్థలు ఆదేశించలేదన్నారు. బీజేపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
