టీఆర్ఎస్ నుండి తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి తెలిపారు. బీజేపీ నేతలు సంప్రదిస్తున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. 

తాను పార్టీ మారబోనని పార్టీ అధినేత కేసీఆర్‌కు, పార్టీకి ఎప్పుడూ విధేయుడిగానే ఉంటానని స్పష్టం చేశారు. తానూ ఎవ్వరితోనూ సంప్రదింపులు జరపడం లేదని టీఆర్ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి తెలిపారు. 

ఇదిలా ఉండగా గురువారం నిజామాబాద్‌ జిల్లా ధర్పల్లిలో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్ర రాజకీయాల్లోకి వెళితేనే బాగుంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.  కేటీఆర్ యువకుడని ఆయన సీఎం అయితే బాగుంటుందని యువకులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. 

దేశంలోని యువ నేతల్లో కేటీఆర్‌ ఒకరని అన్నారు. ఆయనకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని అందుకే ఆయన ముఖ్యమంత్రిగా అన్ని విధాల అర్హుడని అన్నారు. కేసీఆర్‌ కేంద్రానికి వెడితే బీజేపీ తప్పుడు విధానాలను ఎదిరిస్తారన్న నమ్మకం తెలంగాణ ప్రజలకు ఉందని తెలిపారు.