తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.  సామాన్య, సెలబ్రెటీలు అనే తేడా లేకుండా అందరికీ ఈ వైరస్ సోకుతోంది. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా.. టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌కు కరోనా సోకింది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సతీమ ణి, కుమారుడికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. 

అయితే, తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని వీజీ గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నామని పేర్కొన్నా రు. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్నానని, అక్కడకు వచ్చిన మరో ఎమ్మెల్సీ నిమ్స్‌లో చేరినట్లు తెలియడంతో తనతో పాటు కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకున్నామని వివరించారు. తనతో పాటు సతీమణి, కుమారుడికి పాజిటివ్‌ అని శనివారం అర్ధరాత్రి తెలిసిందని, కోడలు, గన్‌మన్, డ్రైవర్‌కు నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా... నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు ఆదివారం కాస్త తగ్గాయి. ఆదివారం 37 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,843కు చేరింది. 

తాజా కేసుల్లోనే నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలోనే ఎక్కువగా ఉన్నాయి. ముబారక్‌నగర్, సీతారాం నగర్‌ కాలనీ, వీక్లీ మార్కెట్, పద్మానగర్, సాయినగర్, గౌతంనగర్, ఎన్‌ఆర్‌ఐ కాలనీలలో కేసులు నమోదయ్యాయి. వేల్పూరు, మంథని, ఆలూరు, దుద్‌గాం, వెల్మల్‌ తదితర ప్రాంతాల్లోనూ పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి.