హైదరాబాద్:టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఆర్టీసీ సమ్మె కారణంగా తమ  నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు.  సమ్మెను పురస్కరించుకొని ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిణామం రాజకీయంగా తమకు నష్టం చేసే అవకాశం ఉందని  టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు  ఆందోళన చెందుతున్నారు.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు  26 డిమాండ్లను ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ యాజమాన్యం ముందుంచిన విషయం తెలిసిందే.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు,సింగరేణి, టీఎన్‌జీవోలతో కలిసి 42 రోజుల పాటు సమ్మె నిర్వహించారు.

మహాబూబ్‌నగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ను ఘోరావ్ చేశారు. అంతేకాదు సీఎం కేసీఆర్ వద్ద తమ సమస్యలను పరిష్కరించాలని  ఆర్టీసీ కార్మికులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ కుచెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆయా ఆర్టీసీ డిపోల్లో ఆయా కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షులుగా గతంలో పనిచేశారు.

తెలంగాణ మజ్దూర్ యూనియన్ కు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు గౌరవాధ్యక్షుడుగా పనిచేశాడు.గత ఏడాది  అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరీష్ రావు ఈ పదవికి రాజీనామా చేశాడు.

సీఎం కేసీఆర్  అపాయింట్ మెంట్ తీసుకొని తమ డిమాండ్లను ప్రస్తావించాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు. అయితే సీఎం అపాయింట్ మెంట్ లభించడం అంతా ఆషామాషీ కాదని టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

టీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలు, సీనియర్ ఎమ్మెల్యేలు కూడ ఈ విషయమై డైలామాలో ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో  తమతో కలిసి పోరాటం చేసిన విషయాన్ని వారు గుర్తు చేసుకొంటున్నారు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతిస్తే రాజకీయంగా కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని మదనపడుతున్నారు. మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు కనీసం సంతాపం తెలపకపోవడంపై కూడ ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.