తెలంగాణలో అధికార పార్టీ నేతల పుత్ర రత్నాలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా చెన్నూరు టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు కొడుకు నల్లాల క్రాంతి ఒక ఫ్యామిలీని వేధించాడు. దీంతో ఆ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేస్తున్న సమాచారం బయటకు తెలియడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఆ కుటుంబాన్ని రక్షించారు. తెలంగాణ సంచలనం రేపిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.

పసునూటి అరవింద్, సువర్ణ అనే ఇద్దరు దంపతులు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. 2016లో అరవింద్, సువర్ణకు చెందిన స్వర్ణమయి వస్త్ర దుకాణంలో భాగస్వామిగా చేరడం కోసం తెలంగాణ ప్రభుత్వ విప్ నల్లాల ఓలేదు కొడుకు నల్లాల క్రాంతి ఒక కోటి 10లక్షలు చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అరవింద్ తండ్రి సాంబయ్య, విప్ ఓదేలు సమక్షంలో ఈ ఒప్పందం కాగితాలు రాసుకున్నారు. అలాగే ఓదేలు బోర్ వెల్ వేసిన డబ్బులు 2 కోట్ల రూపాయలు సాంబయ్యకు ఇవ్వాల్సి ఉంది. ఈ సమయంలో 2017లో సాంబయ్య మరణించాడు. అప్పటి నుంచి నల్లాల ఓదేలు కుటుంబసభ్యులు, ఆయన అనుచరగణం అరవింద్ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిపై రెండుమూడు సార్లు ఓదేలు సమక్షంలో చర్చలు కూడా జరిపారు. కానీ అరవింద్ కుటుంబానికి డబ్బులు మాత్రం ఇవ్వలేదు.

అయితే జైపూర్ కు చెందిన టిఆర్ఎస్ నాయకుడు మధుకర్ రెడ్డి ద్వారా నల్లాల క్రాంతి సెల్ ఫోన్ లో బెదిరింపులకు గురిచేయించాడని ఆరోపిస్తున్నారు. అడ్డమైన భాషలో మాట్లాడడంతో తాము కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుందామని రైలు పట్టాల మీదకు వెళ్లినట్లు అరవింద్ చెబుతున్నాడు. తనకు ఓదేలు ఫ్యామిలీ నుంచి సుమారు 3కోట్లు రావాల్సి ఉందని, వాటిని వెంటనే ఇప్పించాలని కోరారు. ప్రభుత్వ అండదండలతో తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తమను ఓదేలు కొడుకు క్రాంతి, వారి అనుచరులు ఏరకంగా వేధింపులకు గరిచేశారో అరవింద్ మాట్లాడిన వీడియో పైన ఉంది చూడండి.